నిబంధనలు పాటించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకూ తావు లేకుండా, నిబంధనల మేరకు పూర్తి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్, జెడ్పీటీసీ జిల్లా రిటర్నింగ్ అధికారి అపూర్వ భరత్ అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సూపర్వైజర్లకు జెడ్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి శిక్షణలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, టేబుళ్లు, సిబ్బంది కేటాయింపు వంటి ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు చేపట్టాలన్నారు. బ్యాలెట్ బాక్సుల స్వీకరణ, భద్రత, సీల్స్ పరిశీలన, బ్యాలెట్ పత్రాల వర్గీకరణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియలను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని స్పష్టం చేశారు. చెల్లుబాటు అయ్యే, చెల్లని బ్యాలెట్ పత్రాలను గుర్తించడంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. సందేహాస్పద బ్యాలెట్ పత్రాల విషయంలో రిటర్నింగ్ అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. కౌంటింగ్ హాలులోకి అనుమతించే అధికారులు, సిబ్బంది, ఏజెంట్ల గుర్తింపు కార్డులు, పాసులను క్షుణ్ణంగా పరిశీలించాలని, అనధికార వ్యక్తులకు ప్రవేశం కల్పించరాదని జేసీ అపూర్వ భరత్ చెప్పారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు కౌంటింగ్ ప్రక్రియపై కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు అవగాహన కల్పించారు.


