5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పరిషత్ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు తెర పడనుంది. జిల్లాలోని 20 జెడ్పీటీసీ, 401 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనుండగా, ఈ నెల ఏడో తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జెడ్పీటీసీల బరిలో 80 మంది, ఎంపీటీసీల బరిలో 933 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రచారానికి మరికొద్ది గంటల్లో గడువు ముగియనున్న తరుణంలో అభ్యర్థుల ప్రచారంతో పల్లెలు హోరెత్తుతున్నాయి. చివరి రోజున గ్రామాల్లో ర్యాలీలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రచారం ఆఖరు దశకు చేరుకోవడంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కూటమి పార్టీల అభ్యర్థులు, నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొన్ని గ్రామాల్లో ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేస్తున్నారు. అలాగే, మద్యం, బిర్యానీ ప్యాకెట్లను సైతం ఇంటింటికీ చేరవేస్తున్నారు. దీనిపై ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
5న వేతనంతో కూడిన సెలవు
కాకినాడ లీగల్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరిగే గురువారం నాడు వేతనంతో కూడిన సెలవును ప్రకటిస్తూ కార్మిక శాఖ ఉత్తర్వు లు జారీ చేసింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని దుకాణాలు, వాణిజ్య సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు ఈ సెలవు వర్తించనుంది. ఈ మేరకు పోలింగ్ జరిగే ప్రాంతాల్లోని అన్ని దుకాణాలు, సంస్థల యాజమాన్యాలు తమ వద్ద పని చేసే ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నెల 5న వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని కార్మిక శాఖ కాకినాడ ఉప కమిషనర్ ఎన్.బుల్లిరాణి ఆదేశించారు. ఈ ఆదేశాలు అమలయ్యేలా సహాయ కార్మిక కమిషనర్లు, సహాయ కార్మిక అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.
పోస్టల్ బ్యాలెట్
ఫెసిలిటేషన్ కేంద్రం తనిఖీ
కాకినాడ రూరల్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు ఓటు వేసేందుకు ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను సోమవారం ఏర్పాటు చేశారు. కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసి ఈ కేంద్రాన్ని కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాల జారీ, ఓటు నమోదు, బ్యాలెట్ బాక్సులు భద్రపరిచే విధానం వంటి అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను సోమవారం ఏర్పాటు చేశామని చెప్పారు. అనంతరం, పిఠాపురంలోని ఫెసిలిటేషన్ సెంటర్‌ను కూడా ఆయన సందర్శించారు. కాకినాడ రూరల్‌లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ 114 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని రూరల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గౌరీశంకర్, ఎంపీడీఓ సతీష్ తెలిపారు.


