● ఎన్నికల హామీలు అమలు చేయని చంద్రబాబు సర్కారు ● ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
● స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల జంకు ● ప్రజల్లోకి వెళ్లేందుకు భయంతో వెనుకంజ
● అన్నదాతా సుఖీభవ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.6 వేలతో సంబంధం లేకుండా రైతులకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తామని ఎన్నికల సమయంలో ఊరూవాడా చంద్రబాబు ఊదరగొట్టారు. ఈ హామీ అమలును మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు. రెండో సంవత్సరం నుంచి లబ్ధిదారుల సంఖ్యను కుదించి, రూ.20 వేలు కాకుండా ఏటా రూ.14 వేల చొప్పున మాత్రమే ఇస్తున్నారు. మరోవైపు ఉచిత పంటల బీమాను పూర్తిగా రద్దు చేశారు. ఇటీవలి భారీ వర్షాలకు జిల్లాలో సుమారు 1.25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. సుమారు 30 వేల మంది రైతులు మాత్రమే చేతి డబ్బులు చెల్లించి, పంటల బీమా చేయించుకున్నట్లు సమాచారం. ఆవిధంగా బీమా చేయించుకోలేని రైతులకు పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలవాలని రైతులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకున్న దాఖలాల్లేవు.
● ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని ఎన్నికల సమయంలో గొప్పగా చెప్పారు. ప్రస్తుతం 60 ఏళ్లు దాటిన అర్హులు దరఖాస్తు చేసుకున్నా పింఛన్లు ఇవ్వకుండా చంద్రబాబు సర్కారు మొండిచెయ్యి చూపిస్తోంది. ఇక 50 ఏళ్లకే పింఛన్ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
● ప్రతి కుటుంబానికీ ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. దీనికి జిల్లాలో 6 లక్షల మందికి పైగా అర్హులుండగా, 2 లక్షల మందికి మాత్రమే.. అది కూడా ఏడాదికి 3 ఒకటి రెండు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు.
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను బుట్టలో వేసుకున్నారు. సూపర్ సిక్స్ హామీలు అంటూ హడావుడి చేసి, జనం ఓట్లతో గద్దెనెక్కారు. తర్వాత షరా మామూలుగానే ఆ హామీలను తుంగలో తొక్కేశారు. అనేక హామీలిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అనేక కీలక హామీలను అరకొరగా మాత్రమే అమలు చేసి, కొన్ని పూర్తిగా అమలు చేయకుండా తమను నిలువునా మోసం చేశారంటూ స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రజలు మరోసారి మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో అమలు చేయని హామీలపై తమను ఎక్కడ నిలదీస్తారోననే భయంతో ప్రజల్లోకి వెళ్లేందుకు, ప్రచారం చేసేందుకు అధికార కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు జంకుతున్నారు.
● అధికారంలోకి వస్తే ప్రతి నిరుద్యోగికీ ఉద్యోగం కల్పిస్తానని, అప్పటి వరకూ ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గడచిన రెండున్నర సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వకపోగా, జిల్లాలోని 1.90 లక్షల మందికి పైగా నిరుద్యోగ యువతకు ఇస్తామన్న భృతికి ఎగనామం పెట్టారు.
● ఆడబిడ్డ నిధి పేరిట 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకూ నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామని సార్వత్రిక ఎన్నికల వేళ హామీ ఇచ్చారు. కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తిస్తుందని ఆర్భాటంగా ప్రకటించారు. కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీని చెత్తబుట్టలో పడేశారు. జిల్లాలోని సుమారు 2.10 లక్షల మంది మహిళలకు ఆడబిడ్డ నిధి అందలేదు.


