కాకినాడ రూరల్: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా కాకినాడ శ్రీపీఠంలో వరుసగా నాలుగో సంవత్సరం కూడా పది రోజుల పాటు నిర్వహించిన మహాశక్తియాగం విజయ దశమి పర్వదినమైన మంగళవారం ఘనంగా ముగిసింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఒకసారి లలితా సహస్ర నామ పారాయణతో పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి కుంకుమార్చనలు చేయించారు. తద్వారా వంద కోట్ల కుంకుమార్చనలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సహస్ర కలశాల్లో పవిత్ర జలాలనుంచి శివపార్వతులకు అభిషేకం, అనంతరం శాంతి కల్యాణం జరిపించారు. 2030 నాటికి వెయ్యి కోట్ల కుంకుమార్చనలు లక్ష్యంగా ఈ మహాయాగం కొనసాగుతుందని స్వామీజీ చెప్పారు. ప్రతి మనిషీ అహంకారాన్ని వీడి, దైవాన్ని ఆరాధించాలని, నేను అనే భావన తొలగితే అమ్మకు స్థానం లభిస్తుందని అన్నారు. ప్రాణమంటే తన దృష్టిలో దైవమని చెప్పారు. పీఠంలో కొలువుదీరిన ఐశ్వర్యాంబిక అమ్మవారు స్వర్ణ కవచాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.


