అతలాకుతలం | - | Sakshi
Sakshi News home page

అతలాకుతలం

Sep 25 2026 12:53 AM | Updated on Sep 25 2026 12:53 AM

వాన వణికిస్తోంది.. జనానికి దడ పుట్టిస్తోంది.. తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది.. చాలాచోట్ల చెట్లు నేలకొరగగా, రహదారులు నీట మునగడంతో జనజీవనం స్తంభించింది. పంట పొలాల్లో నీరు చేరింది.. ఉప్పాడ వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది.. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో జనంలో భయం రేకెత్తిస్తోంది.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రెండు రోజులుగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంటలు నీట మునిగాయి. జిల్లాలో గురువారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వ్యవధిలో సగటున 21.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కరపలో 31.2 మిల్లీమీటర్లు కురవగా.. అత్యల్పంగా తునిలో 10.2 మిల్లీమీటర్లు పడింది.

పొంగిన ఏలేరు, సుద్దగడ్డ

ఎడతెరపి లేని వర్షాలతో ఏలేరు, సుద్దగడ్డ పొంగి ప్రవహిస్తుండడంతో పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలు జలమయంగా మరాయి. వరద ప్రభావంతో ఇప్పటి వరకు ఆ నియోజకవర్గ పరిధిలో 2,672 ఎకరాల్లో వరి, 50 ఎకరాల్లో పత్తి పంటలు నీట మునిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. రెండు రోజులు సుద్దగడ్డ, ఖండికాలువల ద్వారా వచ్చే నీరు ఎక్కువగా ఉంటే పంట నష్టం పెరగవచ్చని వారు తెలిపారు. గొల్లప్రోలులో లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి.

పంపాతో పెరిగిన నీటిమట్టం

భారీ వర్షాలకు పంపా నదిలో నీటిమట్టం పెరుగుతోంది. ప్రస్తుతం 95 అడుగులకు చేరింది. దీంతో దిగువ ప్రాంతంలో ఉన్న ఆయకట్టుకు కొంతమేర నీటి సమస్య తీరనుంది. ఏలేరు ప్రాజెక్టులో నీటి నిల్వలు స్వల్పంగా పెరిగాయి. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు 28,458 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులో చేరింది. దీంతో 24.11 టీఎంసీలకు గాను 11.99 టీఎంసీలకు నీటి నిల్వలు చేరాయి. ఏలేరు ప్రాజెక్టులోకి పురుషోత్తపట్నం నుంచి 1,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

పంటలు మునక..

● సామర్లకోట మండలం వెంకటకృష్ణరాయపురం గ్రామంలో సుమారు మూడు వేల ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. పెద్దాపురం మండలంలో పలు గ్రామాల్లో వరి పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ఏలేరు ప్రధాన కాలువను ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఒకవైపు వర్షంనీరు, మరోవైపు ఏలేరు ప్రాజెక్టు నుంచి ముంచెత్తిన నీరుతో సిరివాడ, పులిమేరు, జి.రాగంపేట, పాత పెద్దాపురం రోడ్డులోని వరి పొలాలు నీటమునిగాయి. సుమారు 500 ఎకరాల్లో పంట నీటమునిగింది.

● మెట్ట ప్రాంతమైన జగ్గంపేట నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలైన కిర్లంపూడి, రాజుపాలెం మార్గం మధ్యలో వరి పంటలు నీట మునిగాయి. వేలంక గ్రామం ఎస్సీ పేట, వీరవరం గ్రామాల్లో పలుచోట్ల వరద నీరు చేరింది. భారీ వర్షం కారణంగా గోకవరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

● కాకినాడ రూరల్‌లో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. తిమ్మాపురంలోని రేపాక గార్డెన్‌, అవంతినగర్‌లో నీరు చేరింది. వాకలపూడి ఫిషర్‌మెన్‌ కాలనీ, కాకినాడ రెండో డివిజన్‌లోని కొండేలుపేట నీటమునిగాయి. కొండేలుపేటలో సుమారు 300 మందికి వైఎస్సార్‌ సీపీ రూరల్‌ కో–ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు ఆ డివిజన్‌ పార్టీ అధ్యక్షుడు వంటలు తయారు చేయించి మధ్యాహ్న భోజనం పంపిణీ చేశారు.

● శంఖవరం మండలం మండపంలో నావూరి కృష్ణ, దాసరి చినబుల్లికి చెందిన ఓ పెంకుటిల్లు నేలమట్టమైంది. ఈ మేరకు తహసీల్దార్‌ సూరిబాబు, ఎంపీడీఓ నాగేంద్ర పరిశీలించారు. జరిగిన నష్టాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు.

జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు

రహదారుల పైకి చేరిన వర్షపు నీరు

లోతట్టు ప్రాంతాలు జలమయం

ఉప్పాడ వద్ద అల్లకల్లోలంగా సముద్రం

పరవళ్లు తొక్కుతున్న పంపా జలాశయం

జిల్లాలో 21 మిల్లీమీటర్ల

సగటు వర్షపాతం

మరో రెండు రోజుల పాటు వానలు

జిల్లాలో వర్షపాతం ఇలా..

మండలం కురిసిన వర్షం

(మిల్లీమీటర్లలో)

తాళ్లరేవు 37.6

సామర్లకోట 29.2

పెద్దాపురం 27.4

కాకినాడ అర్బన్‌ 26.2

కాకినాడ రూరల్‌ 25.4

కాజులూరు 24.8

జగ్గంపేట 22.6

యు.కొత్తపల్లి 21.2

ఏలేశ్వరం 20.8

గండేపల్లి 19.6

ప్రత్తిపాడు 19.2

గొల్లప్రోలు 19.0

పిఠాపురం 19.0

కిర్లంపూడి 17.4

కోటనందూరు 17.2

పెదపూడి 14.2

శంఖవరం 14.2

రౌతులపూడి 12.8

తొండంగి 10.8

తుని 10.2

రైలు పట్టాలపై వర్షపు నీరు

సామర్లకోట : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముంచెత్తడంతో సామర్లకోట రైల్వే పట్టాలపై భారీగా నీరు చేరింది. గురువారం భారీ వర్షాలకు సత్యనారాయణపురం, ఎఫ్‌సీఐ గోడౌన్‌ సమీపంలో ఉన్న చెరువుకు గండిపడటంతో ఒక్కసారిగా వరద నీరు ఉప్పొంగింది. నీరు ఎక్కువవ్వడంతో సౌత్‌ క్యాబిన్‌ వద్ద, ఎప్‌సీఐ గోడౌన్‌ వద్ద రైల్వే పట్టాలపై నీరు చేరడంతో రైల్వే అధికారులు అప్రమత్తమై నీటిని తొలగించే కార్యక్రమం చేపట్టారు.

వరద నీటి తాండవం

వర్షాలకు రిజర్వాయర్లు, చెరువుల్లోకి స్వల్పంగా వరదనీరు వచ్చి చేరుతోంది. 105 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న పంపా రిజర్వాయర్‌లో 93.501 అడుగులు, 380 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న తాండవ రిజర్వాయర్‌లో 364.501 అడుగులకు నీటి నిల్వలు చేరాయి. పరివాహక ప్రాంతాల నుంచి పంపాకు 230 క్యూసెక్కులు, తాండవకు 2,250 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతున్నట్టు ఆయా ప్రాజెక్టుల అధికారులు తెలిపారు. ప్రస్తుతం తాండవ రిజర్వాయర్‌ నుంచి వరద నీటిని విడుదల చేయడం లేదు. గరిష్ట నీటిమట్టం 376 అడుగులకు చేరితే, క్రస్ట్‌ గేట్లు తెరిచి దిగువనకు నీటి విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

రత్నగిరి ఘాట్‌రోడ్డులో కూలిన చెట్టు

అన్నవరం: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రత్నగిరి మొదటి ఘాట్‌రోడ్‌ రెండో మలుపులో కొండ చరియలు నానిపోయి గురువారం రాత్రి భారీ వృక్షం రోడ్డుపై కూలిపోయింది. దీంతో విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. విషయం తెలుసుకున్న విద్యుత్‌ శాఖ డీఈ వి.సత్యనారాయణ విద్యుత్‌ సరఫరా నిలిపివేయగా, దేవస్థానం సిబ్బంది చెట్టును తొలగించారు. ఈ ఘటనతో ఆ రోడ్డులో రాకపోకలు నిలచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement