● సముద్ర అలలతో సయ్యాటలతో
ప్రాణాలకే ప్రమాదం
● నిమజ్జనాల వేళ జాగ్రత్తసుమా!
పిఠాపురం: గణపతి నవరాత్ర ఉత్సవాలు ముగిశాయి. గణేశుని నిమజ్జనోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. గురు, శనివారాల వరకూ నిమజ్జనాలు జరిగే అవకాశాలున్నాయని పలు మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. కాకినాడ, పిఠాపురం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వేలాది మండపాల్లోని గణేశునికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. ఆ స్వామి విగ్రహాలను సాగర జలాల్లో నిమజ్జనం చేస్తున్నారు. అయితే, సముద్రంలో నిమజ్జనం చేసే వేళ భక్తులు అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం తీవ్ర వాయుగుండం పొంచి ఉన్న వేళ.. ఎగసి పడే రాకాసి అలలతో సయ్యాటలు ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అలల్లో.. అలా ప్రమాదం
కడలిలో ఉవ్వెత్తున ఎగసి పడే రాకాసి అలల నడుమ ఇరుకై న చీలిక ప్రవాహాలు ఉంటాయి. వీటిని రిప్ కరెంట్ అంటారు. సముద్ర గర్భంలో సుదూర ప్రాంతంలో గాలి పీడనంతో ఏర్పడిన ఈ అలలు నీటి అడుగున బలమైన ప్రవాహాలుగా దూసుకొస్తాయి. తీరానికి చేరేసరికి రాకాసి అలలుగా మారిపోతాయి. ఈ అల ఒక్కసారిగా తీరాన్ని తాకినప్పుడు సముద్రం అడుగు భాగాన అత్యంత బలమైన ప్రవాహం ఏర్పడుతుంది. ఆ ప్రవాహం తిరిగి సముద్రంలోకి అత్యంత వేగంతో మళ్లుతుంది. దీని వేగం సెకనుకు 2 నుంచి 8 అడుగుల వరకు ఉంటుంది. ఇది తీరానికి సమాంతరంగా 10 నుంచి 20 అడుగుల వెడల్పున ఏర్పడుతుంది. ఇది ఎంతటి గజ ఈతగాడినైనా ఒక్కసారిగా కడలి గర్భంలో కలిపేస్తుంది. సాధారణంగా తూర్పు తీరంలో కాకినాడ నుంచి విశాఖపట్నం వరకు ఆగస్ట్ – అక్టోబర్ నెలల మధ్య ఈ రిప్ కరెంట్ అలలు ఎక్కువగా వస్తాయని పరిశోధకులు నిర్ధరించారు. ఎక్కువగా రెండు సముద్రాలు లేదా రెండు ప్రవాహాలు కలిసే చోట ఇవి సంభవిస్తాయి. కాకినాడ నుంచి విశాఖ వరకు తీరంలో ఉప్పుటేరులు, కాలువలు కలిసే ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అందువల్లనే ఇక్కడ రిప్ కరెంటు ముప్పు అధికంగా ఉంటోంది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో దాదాపు 370 మంది రిప్ కరెంట్ వల్ల మృత్యువాత పడ్డారు. ఉప్పాడ తీరంలో గతంలో ముగ్గురు ఈ రాకాసి అలలకు బలయ్యారు. వీటిపై ఏయూ, ఇస్రో సంయుక్తంగా పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. సముద్ర అలలను కెమెరాల ద్వారా నిత్యం గమనిస్తూ, ప్రత్యేక పరికరం ద్వారా అలల ఎత్తు, దిశ, సమయాన్ని లెక్కిస్తారు. తద్వారా రిప్ కరెంట్ ఎక్కడ, ఎలా ఏర్పడే అవకాశముందో గుర్తించి, ముందస్తు హెచ్చరికలు జారీ చేసే విధంగా ప్రయోగాలు చేస్తున్నారు.
ప్రమాదకర ప్రదేశాలను గుర్తించాం
ఉప్పాడ హార్బర్ నిర్మాణ ప్రాంతానికి ఆనుకుని ఉన్న తీరం చాలా ప్రమాదకర ప్రదేశంగా గుర్తించాం. అందుకే అక్కడ నిమజ్జనాలను నిషేదించి, ఇతర ప్రాంతాల్లో అనుమతిస్తున్నాం. ముఖ్యంగా ఉప్పుటేరులు సముద్రంలో కలిసే చోట అలలు తక్కువగా ఉన్నా క్షణాల్లో ప్రమాదకరంగా మారుతూంటాయి. అందుకే, కాకినాడ శివారు లైట్‌హౌస్ నుంచి కొత్తపల్లి మండలం కోనపాపపేట వరకు ఉన్న ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం చేశాం. మూలపేట, సుబ్బంపేటల్లో నిమజ్జనానికి అనువైన ప్రాంతాలను సిద్ధం చేశాం. పటిష్ట బందోబస్తు నడుమ అక్కడే దగ్గరుండి నిమజ్జనాలు చేయిస్తున్నాం.
– జీవీవీ సత్యనారాయణ, సీఐ, పిఠాపురం


