● ‘తల్లికి వందనం’ సొమ్ము జమలో మెలికలు
● వివిధ సాకులు చూపుతూ అర్హులకు కోత
● మూతపడిన పాఠశాలకు మళ్లింపు
● ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు
అందరికీ ‘తల్లికి వందనం’ అన్నారు..
ఇప్పుడు సాకులు వెతికి మరీ కోత పెట్టారు.. నిధుల జమలోనూ తిర‘కాసులు’ పెట్టేశారు.. ఈ పరిణామాలతో లబ్ధిదారులు తల్లడిల్లిపోతున్నారు.. ఎన్నో ఆశల మధ్య తమ పిల్లలను చదివించుకుంటున్న తల్లిదండ్రులకు ఆందోళన మిగిల్చారు. ఈ పథకం అమలులో భారీగా కోతలు పెట్టడంతో ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది.
పిఠాపురం: తల్లికి వందనం పథకం అమలుకు గ్రహణం పట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివిస్తున్న అర్హులైన తల్లులకు అందాల్సిన సొమ్ము ప్రైవేటు స్కూళ్లకు వెళ్తున్నాయి. మూతపడిన పాఠశాల ఖాతాలకు ఈ నిధులు మళ్లుతున్నాయి. తప్పులతడకగా ఈ పథకం అమలవుతోందనడానికి ఇదే నిదర్శనం. ఓ కుటుంబంలో చదువుతున్న విద్యార్థులందరికీ ‘తల్లికి వందనం’ పథకం కింద ఏడాదికి రూ.15 వేలు జమ చేస్తామని ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని అనేక సాకులతో మమ అనిపిస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టిన తొలి ఏడాది పూర్తిగా ఎగొట్టిన ప్రభుత్వం, గత ఏడాది అరకొర నిధులు విదిల్చింది. ఇప్పుడు తాజాగా మూడో ఏడాది పూర్తిగా అమలు చేస్తారని ఎదురు చూసిన తల్లులకు నిరాశే మిగిల్చింది. గత ఏడాది 2.28 లక్షల మందికి విడుదల చేయగా, ఈ ఏడాది విద్యార్థుల సంఖ్య పెరిగినా, లబ్ధిదారుల్లో మాత్రం కోత విధించింది. గత ఏడాది లబ్ధి పొంది, ఈ ఏడాది జమ కాకపోవడంతో అర్హులు తల్లడిల్లిపోతున్నారు.
చెప్పేదొకటి.. ఇచ్చేదొకటి
ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమందికీ ఒక్కొక్కరికి రూ.15 వేలు జమ చేస్తామంటూ కూటమి నేతలు ఎన్నికల ముందు ప్రచారం చేసుకున్నారు. ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు. కానీ రూ.13 వేల చొప్పున మాత్రమే తల్లి వందనం సొమ్ము అందిస్తున్నారు. నిబంధనల పేరుతో కోత విధించి వేలాది మందిని అనర్హులుగా మార్చేయడంతో పాటు కుటుంబంలో ముగ్గురు విద్యార్థులు ఉంటే, రూ.13 వేలు మాత్రమే జమ అవుతోంది. తద్వారా మరో ఇద్దరికి రూ.26 వేలు కోత పెడుతున్నారు. ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా పూర్తిగా జమ చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారని, ఇప్పుడు ఒక్కొక్కరికీ రూ.2 వేలు తగ్గించి ఇవ్వడమేంటని పలువురు విద్యార్థుల తల్లులు ప్రశ్నిస్తున్నారు.
ఎగ్గొట్టే సాకులెన్నో..
ఎగ్గొట్టాలంటే సవాలక్ష సాకులు ఉంటాయి. సరిగ్గా ఆ విధానాన్నే చంద్రబాబు ప్రభుత్వం అవలంబించింది. వేసవిలో విద్యుత్ వినియోగం పెరగడం సాధారణమే. ఇప్పుడు దానినే ప్రామాణికంగా తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో పేదలను సైతం పథకానికి దూరం చేసింది. నాలుగు చక్రాల వాహనం, 300 యూనిట్లు దాటిన కరెంటు బిల్లు, నెలసరి ఆదాయం రూ.12 వేలు వచ్చిందంటూ ఒక్క పిఠాపురం జగ్గయ్యచెరువు కాలనీలో 184 మంది నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లులను అనర్హులుగా ప్రకటించింది.
తల్లికి అడుగడుగునా దగా...
చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం పేరుతో తల్లులను అడుగడుగునా దగా చేస్తోంది. అనేక సాకులు చూపుతూ తల్లుల ఖాతాలో నిధులు జమ చేయడం లేదు. పథకంలో లబ్ధి పొందేందుకు అన్ని అర్హతలున్నా, లబ్ధి చేకూరడం లేదు. కొన్ని ప్రాంతాల్లో తల్లికి వందనం నిధులను డ్వాక్రా రుణాలకు జమ చేసుకుంటున్న ఘటనలు ఉన్నాయి. వాటిని హోల్డ్ చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పథకం ఫలాలు నేరుగా లబ్ధిదారులకే దక్కేవి. ప్రస్తుతం నిధులు ఎలా ఎగ్గొట్టాలా..? అని కారణాలు వెతకడం దారుణం.
– కురసాల కన్నబాబు, వైఎస్సార్ సీపీ
ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్,
మాజీ మంత్రి, కాకినాడ
వేరే స్కూల్ ఖాతాకు వేస్తూ..
నా ఇద్దరు పిల్లలు బీర భవ్యశ్రీ (3వ తరగతి), లహర్ష (2వ తరగతి). పిఠాపురం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. గత ఏడాది ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీటు వచ్చిందని చేరారు. ఉచిత సీటు ఉన్నా, మిగిలిన ఖర్చులు భరించలేక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాను. గతంలో, ఇప్పుడు తల్లికి వందనం నిధులు ఆయా ప్రైవేట్ స్కూళ్ల ఖాతాల్లో జమ అయ్యాయి. మా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. తల్లికి వందనం నిధులు జమయ్యే విధంగా చూడాలని రెండేళ్లుగా తిరుగుతున్నా, ఫలితం లేదు.
– బీర ధర్మరాజు, అగ్రహారం, పిఠాపురం
మూతపడిన పాఠశాలకు...
మా అమ్మాయి కొల్లా బత్తుల లక్ష్మీభార్గవి సీబీఎం ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతుంది. గతంలో పిఠాపురంలోని ప్రైవేటు స్కూల్‌లో ఉచిత సీటు వచ్చిందని ఒకటో తరగతిలో చేర్పించాను. అదనపు ఫీజులు భరించలేక తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేర్చారు. రెండేళ్లుగా తల్లికి వందనం నిధులు ఆ ప్రైవేట్ స్కూల్ అకౌంట్‌కు జమవుతున్నాయి. ప్రస్తుతం ఆ పాఠశాల మూతపడి ఉంది. దీనిపై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు.
– కొల్లాబత్తుల
విజయ్ కుమార్,
అగ్రహారం,
పిఠాపురం
జూనియర్
కళాశాల
విద్యార్థులు :
55
వేల మంది
అనర్హులు :
69
వేల మంది
జిల్లాలో
తల్లికి వందనం ఇలా..
1–10 చదువు
తున్న విద్యార్థులు :
2.90
లక్షల మంది
తల్లికి వందనం
పథకానికి అర్హులు :
2.76
లక్షలు


