రామచంద్రపురం రూరల్: కాలువలో స్నానానికి వెళ్లి అన్నాచెల్లెళ్లు (ముగ్గురు) మృత్యువాత పడిన ఘటనతో రామచంద్రపురం మండలం వెలంపాలెంలో శుక్రవారం పెను విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పోతుల మధు సాల్మన్ రాజు, శాంతకుమారి దంపతులకు నలుగురు కుమార్తెలు. ఏడాది క్రితం మధు సాల్మన్ రాజు మృతి చెందడంతో గురువారం హైదరాబాద్‌లో ఉపాధి నిమిత్తం ఉంటున్న ముగ్గురు కుమార్తెలు, రావులపాలెం సమీపంలోని తాతపూడి వద్ద ఉంటున్న నాలుగో కుమార్తె తమ పిల్లలతో సహా వెలంపాలెం గ్రామానికి వచ్చి కార్యక్రమం నిర్వహించుకున్నారు.
ఒకరిని కాపాడబోయి మరొకరుగా..
హైదరాబాద్ చందానగర్‌లో ఉంటున్న ముగ్గురు కుమార్తెలు, వారి పిల్లలు శనివారం తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్నారు. శుక్రవారం కాకినాడ బీచ్‌కు, కోరంగి అభయారణ్యానికి వెళదామని అనుకున్నారు. కానీ వెళ్లకపోవడంతో సాయంత్రం పెద్ద కుమార్తె బొక్కే లత కుమారుడు వీరేంద్ర (18) మరో ఆరుగురు చిన్నారులను బైక్‌పై ఎక్కించుకుని సమీపంలోని వెంకటాయపాలెం కాలువ వద్దకు స్నానానికి తీసుకుని వెళ్లాడు. ఈ క్రమంలో మూడో కుమార్తె వేమన మంజుప్రియ కుమార్తె వర్షిత పావని (15) నీటి మునిగి పోయింది. ఆమెను కాపాడే ప్రయత్నంలో వీరేంద్ర, రెండో కుమార్తె కనికెళ్ల కాంతి లత కుమారుడు రంజిత్ కుమార్ (15) కూడా నీట మునిగి మృత్యువాత పడ్డారు.
రాఖీ కట్టించుకుని వెళతామన్నారు
హైదరాబాద్‌కు శనివారం తిరుగు ప్రయాణం నిమిత్తం టికెట్లు తీసుకున్న నేపథ్యంలో తమ చెల్లెళ్లతో రాఖీలు కట్టించుకుని వెళతామని తన అక్కల కుమారులు చెప్పినట్టు కాళిదాసు రాజకుమారి (నాలుగో కుమార్తె) కన్నీటి పర్యంతమైంది. వారందరూ కాలువకు వెళ్లిన తర్వాత తాను తన చిన్న కుమార్తెకు చెవి పోగులు కుట్టించాలని బైక్ తీసుకుని రమ్మని పలుమార్లు ఫోన్ చేశానని తెలిపింది. అయితే ఫోన్‌ను వారితో పాటు వెళ్లిన తన పెద్ద కుమార్తెకు ఇచ్చేసి వారు స్నానానికి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేసింది.
పేద కుటుంబాలే..
ఫ పెద్ద కుమార్తె బొక్కే లత, గనిరాజు దంపతులది పసలపూడి. భర్త కర్ణాటకలో వెల్డింగ్ పని నిమిత్తం ఉంటుండగా లత తన తల్లి శాంతకుమారితో కలసి హైదరాబాద్ చందానగర్‌లో ఇళ్లల్లో పని చేసుకుంటూ కుమారుడు, కుమార్తెతో కలసి జీవిస్తోంది. చేతికి అందివచ్చిన కుమారుడిని పోగొట్టుకుని కన్నీరు మున్నీరు అవుతోంది.
ఫ రెండో కుమార్తె కనికెళ్ల కాంతి లత, సత్యనారాయణ దంపతులది అంగర గ్రామం. హైదరాబాద్‌లో వాచ్‌మన్‌గా పనిచేసుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. ఈ ప్రమాదంలో పెద్ద కుమారుడిని పోగొట్టుకున్నారు.
ఫ మూడో కుమార్తె వేమన మంజు ప్రియ, భర్త ఆనంద కుమార్‌లది అంగర సమీపంలోని పడమర ఖండ్రిగ గ్రామం. ఆనంద కుమార్ చనిపోవడంతో మంజు ప్రియ హైదరాబాద్ చందానగర్‌లో ఇళ్లలో పనిచేసుకుంటూ తన కుమారుడు, కుమార్తెలతో జీవిస్తోంది. ఈ ప్రమాదంలో కుమార్తెను కోల్పోయింది.


