సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమిలో ‘ఉనికి’పాట్లు మొదలుపెట్టారు.. ఎవరికి వారు మైలేజ్ పాలి‘ట్రిక్స్’కు తెరలేపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూటమిలో టీడీపీ నేతల దందాలు పేట్రేగిపోతున్నాయి. మద్యం మాఫియాతో పాటు, ఇసుక, మట్టి తవ్వకాలు, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో జనసేన నేతలకు ప్రాతినిథ్యం ఇవ్వగా.. మరికొన్ని నియోజకవర్గాల్లో మిత్రపక్షమైన జనసేన, బీజేపీ నేతలకు మాత్రం ఎంట్రీ ఉండటం లేదు. ఈ పరిణామం బీజేపీ, జనసేన నేతల్లో మింగుడుపడని అంశంగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచీ ఇదే తంతు సాగుతోంది. కూటమంటే కేవలం టీడీపీ అనే భావన ప్రజల్లో కలుగుతుండటంతో మిత్రపక్ష పార్టీలు నయా పంథాకు తెర తీశాయి. కూటమిలో తామూ ఉన్నామంటూ ప్రజలకు తెలిపేందుకు పడుతున్న పాట్లు వర్ణనాతీతం.
యాత్ర.. సొంత పాత్ర
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జీవనాడి పోలవరం ప్రాజెక్టును కేంద్రంగా చేసుకుని బీజేపీ ప్రత్యేక రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తోందనే చర్చ విస్తతంగా జరుగుతోంది. ఇటీవల రాజమహేంద్రవరం నుంచి బీజేపీ నేతలు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులతో భారీ ర్యాలీగా పోలవరం సందర్శనకు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులో టీడీపీ, జనసేన నేతలు లేకపోవడం చర్చకు దారితీసింది. దీనిని బట్టి చూస్తే రాష్ట్రంలో బీజేపీ మైలేజ్ పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతుంది. ఇదేమని ప్రశ్నించిన రాజకీయ విశ్లేషకులకు బీజేపీ నేతలు వింతైన వాదన వినిపిస్తున్నట్లు సమాచారం. పోలవరం కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు కాదని.. రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశంగా చెబుతున్నారు. పోలవరంతో బీజేపీకి దశాబ్దాలుగా ఎమోషనల్ బాండింగ్ ఉందని, జనతా పార్టీ కాలం నుంచే పోలవరం కోసం ఉద్యమాలు చేశామని ప్రచారం చేసుకుంటున్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో పోలవరం చేర్చడంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఒంటరిగా పోలవరం ప్రాజెక్టుపై ప్రచారం చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
స్థానిక సంస్థల్లో సై అంటూ..
కూటమిలో మరో భాగస్వామిగా ఉన్న జనసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు పట్టున్న అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తుందని జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యుల స్థానాల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తామని ఇటీవల విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు చీలకుండా ఉండేందుకు, కూటమిని బలపర్చేందుకు తగ్గి పోటీ చేశామని, రాబోయే ఎన్నికల్లో అదే విధంగా పోటీ చేస్తామనడం అసంభవమన్నారు. భవిష్యత్తులో అలాంటి విధానం వర్తించదన్నారు. జనసేనకు పట్టున్న స్థానాల్లో పోటీ చేస్తామని, ఇందులో టీడీపీ ఆదేశాలు పాటించే పరిస్థితి లేదని నర్మగర్భంగా వెల్లడించారు. దీనిని బట్టి చూస్తే జనసేన, టీడీపీ మధ్య క్షేత్ర స్థాయిలోనే కాదు.. పై స్థాయిలో సైతం విభేదాలు ఉన్నాయన్న విషయం తేటతెల్లమవుతోంది. ఈ పరిణామం టీడీపీ నేతలకు మింగుడుపడని అంశంగా మారింది. ఇప్పటికే పార్టీ కోసం శ్రమించిన అనేక మంది టీడీపీ శ్రేణులు పదవుల కోసం నిరీక్షిస్తున్నారు. అలాంటి తరుణంలో జనసేన నేతలు పక్కలో బల్లెం తరహాలో తయారవుతుండటంతో టీడీపీ నేతలు అయోమయానికి గురవుతున్నారు.
ఫ జనసేన, బీజేపీ, టీడీపీ మధ్య
వర్గ విభేదాలు
ఫ ప్రాధాన్యం చాటుకునేలా
బీజేపీ పోలవరం యాత్ర
ఫ స్థానిక సంస్థల్లో బలమున్న స్థానాల్లో పోటీ చేస్తామని నాదెండ్ల ప్రకటన
ఫ ఈ పరిణామాలతో కూటమిలో
ఏం జరుగుతుందోనని చర్చ
ఉమ్మడి తూర్పులో విభేదాలు
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాట్లలో భాగంగా ఎమ్మెల్యే స్థానాలు త్యాగం చేశారు. నామినేటెడ్ పదవుల భర్తీలోనూ అత్యధిక శాతం పోస్టులు టీడీపీ నేతలకే కట్టబెట్టారు. బీజేపీ, జనసేన నేతలకు మాత్రం నామమాత్రంగా కేటాయించారు. ఇకపై ఆ విధానం ఉండదని చర్చించుకుంటున్నారు.
ఫ నిడదవోలు నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నేతల మధ్య వర్గ పోరు కొనసాగుతూనే ఉంది. మంత్రి కందుల దుర్గేష్, టీడీపీ ఇన్‌చార్జ్ బూరుగుపల్లి శేషారావు వర్గాల మధ్య ఆధిపత్య పోరు చల్లారడం లేదు. కూటమిలో భాగమైనా.. అధికారిక కార్యక్రమాలకు శేషారావు దూరంగా ఉంటున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో జనసేన నేతలకు అందలం వేయడం, బీజేపీ, టీడీపీ నేతలను విస్మరించడంపై నేతలు గుర్రుగా ఉన్నారు.
ఫ కొవ్వూరు నియోజకవర్గంలోనూ ఇదే తంతు సాగుతోంది.
ఫ రాజానగరం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, టీడీపీ ఇన్‌చార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గాల మధ్య విభేదాలు రాజుకున్నాయి. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి చేరాయి.
ఫ పిఠాపురం నియోజకవర్గంలో సైతం ఇదే పరిస్థితి ఉంది. టీడీపీ సీనియర్ నేత వర్మకు జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. ఎంతగా అంటే.. టీడీపీలో సీనియర్ నేత అయినా వర్మను ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించే స్థాయికి చేరిందంటే ఏ స్థాయిలో వైషమ్యాలు ఉన్నాయో అర్థమవుతోంది.
ఫ అమలాపురంలో టీడీపీ ఎమ్మెల్యే ఆనందరావు, జనసేన నేతలకు పచ్చగట్టి వేస్తే భగ్గుమంటోంది. కూటమిలో మిత్రపక్షమైన, ఎమ్మెల్యే విజయానికి కృషి చేసిన తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని జనసేన నేతలు గుర్రుగా ఉన్నారు. కేవలం ఈ నియోజకవర్గాల్లోనే కాదు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు సాగుతోంది.


