ఎస్‌ఎఫ్‌ఐ, ప్రజా సంఘాల డిమాండ్
పిఠాపురం రూరల్: నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. ఈ మేరకు పిఠాపురం రథాలపేట అంబేడ్కర్ సెంటర్ వద్ద కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థలో పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. శుక్రవారం విద్యార్థి సంఘాల జేఏసీ పిలుపునిచ్చిన దేశవ్యాప్త బంద్‌ను విజయవంతం చేయాలని విద్యార్థులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ లోవరాజు, మండల అధ్యక్షుడు జి.చిన్ని, మండల కార్యదర్శి కె.సిద్ధూ, ప్రజా సంఘాల నాయకులు కె.చిన్న, జి.వీరబాబు, కోనేటి రాజు, గోపాలకృష్ణ, నాగేశ్వరరావు, పప్పుల వీరబాబు, ఎస్ రాజేష్, సత్యనారాయణ, గోవింద్, సూర్యనారాయణ, సీహెచ్ శ్రీనివాస్, కె అప్పన్న, బి వడ్డీకాసులు, చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.


