బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఏలూరు జిల్లా అరిగిపల్లి హీల్ ప్యారడైజ్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పారా స్పోర్ట్స్ మీట్‌లో జిల్లా దివ్యాంగ విద్యార్థులు పరుగు, లాంగ్ జంప్ వంటి విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. ఈ టోర్నీలో 7 బంగారు, 4 సిల్వర్, 10 రజిత పథకాలు సాధించారు. కాజులూరు మండలం నుంచి నలుగురు విద్యార్థులు, కాకినాడ అర్బన్ నుంచి ఒకరు, కాకినాడ రూరల్ నుంచి ఒకరు, పెదపూడి మండలం నుంచి ఇద్దరు, ప్రత్తిపాడు నుంచి ఒకరు విజేతలుగా నిలిచారు. ఈ మేరకు గురువారం కాకినాడ కలెక్టరేట్‌లో కలెక్టర్ హరేంధిర ప్రసాద్‌ను విద్యాశాఖ అధికారులతో విజేతలు కలిశారు. వారిని కలెక్టర్ అభినందించారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులోనూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ అధికారి పి.రమేష్, సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ సత్యనారాయణ పాల్గొన్నారు.


