కిర్లంపూడి: తెలుగు నేలపై సామాజిక ఉద్యమకారులకు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత దివంగత ముద్రగడ పద్మనాభం ఆదర్శమని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ అన్నారు. గురువారం కిర్లంపూడిలోని ముద్రగడ పద్మనాభం నివాసానికి వచ్చిన ఆయన ముద్రగడ సతీమణి పద్మావతి, కుమారులు వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, ఆయన పెద్ద కుమారుడు ముద్రగడ వీరరాఘవరావు (బాలు)ను పరామర్శించారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాదిగ విలేకర్లతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో గొప్ప నాయకుడు దివంగత ముద్రగడ పద్మనాభం అని అన్నారు. దివంగత వంగవీటి మోహన్‌రంగా కాపు వర్గాల్లోనే కాకుండా దళితులు, పీడిత వర్గాల గుండెల్లో చోటు పొందారన్నారు. ఆయన తర్వాత ముద్రగడ పేరొందారని కొనియాడారు. తమలాంటి ఉద్యమకారులకు ఆయన అంటే ఎనలేని గౌరవం అని తెలిపారు. పదవులు వస్తుంటాయి.. పోతుంటాయని, తాను నమ్ముకున్న జాతికోసం రాజకీయాలు, పదవులు లెక్కచేయకుండా దృఢ సంకల్పంతో సాగారన్నారు. దళితులను అక్కున చేర్చుకుంటామని ఎంతో మంది రాజకీయ నాయకులు అంటారని, ముద్రగడ వాటిని తూచా తప్పకుండా ఆచరించారని అన్నారు. తాను నివసించే ఇంట్లోనే మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మాజీ సీఎం దామోదరం సంజీవయ్య విగ్రహాలను ఏర్పాటు చేయడం ఆయన గొప్పతనానికి నిదర్శనం అన్నారు. ఆయన కుమారులు ముద్రగడ గిరిబాబు, వీరరాఘవరావులు ముద్రగడ బాటలోనే నడుస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో దళిత నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు
మంద కృష్ణ మాదిగ


