కాకినాడ రూరల్: జలాశయాల్లో చేప పిల్లల నిల్వ ప్రాముఖ్యత, మత్స్య అభివృద్ధిలో మత్స్య సహకార సంఘాల పాత్రపై కాకినాడలోని రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (ఎస్‌ఐఎఫ్‌టీ)లో మూడు రోజుల శిక్షణ గురువారంతో ముగిసింది. హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఎఫ్‌డీబీ సహకారంతో జలాశయాల్లో మత్స్య సంపద ద్వారా సహకార సంఘాలకు ఆదాయం వృద్ధి కోసం ఈ కార్యక్రమం నిర్వహించినట్టు ఎస్‌ఐఎఫ్‌టీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.అంజలి తెలిపారు. చెరువులు, జలాశయాల ఉత్పాదకత అంచనా, మత్స్య వనరులు, స్థిరమైన చేపల ఉత్పత్తి కోసం జలాశయాల నిర్వహణ తదితర అంశాలపై బెంగళూరుకు చెందిన సీఐఎఫ్‌ఆర్‌ఐ హెడ్, సైంటిస్ట్ డాక్టర్ ఎల్‌ఎస్ మూర్తి, మత్స్యశాఖ విశ్రాంత అధికారులు రామ్మోహనరావు, జయరావు, రంపచోడవరం కేవీకే శాస్త్రవేత్త వీరాంజనేయులు అవగాహన కల్పించారు.
అనధికార లేఅవుట్ల తొలగింపు
కాకినాడ రూరల్: కాకినాడ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కౌడా) ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధ్వర్యంలో జిల్లాలో పలు గ్రామ పంచాయతీల్లో అనధికార లే అవుట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. కౌడా చీఫ్ ప్లానింగ్ అధికారి మీనాకుమరి పర్యవేక్షణలో ఏపీఓ కృష్ణారావు, రామిరెడ్డి, ఆనందకుమార్, జేపీఓలు శివరామకృష్ణ, వెంకటరావు తమ సిబ్బందితో నాలుగో రోజు గురువారం మెట్టలో అనధికార లేఅవుట్లు ధ్వంసం చేశారు. జగ్గంపేట మండలం జె.కొత్తూరులో మూడు అనధికార లేఅవుట్‌లు, రామవరం, జగ్గంపేట, కిర్లంపూడి మండలం బూరుగుపూడి, కృష్ణవరం, సోమవరం గ్రామాల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం లే అవుట్‌లలో సరిహద్దు రాళ్లను తొలగించి, రోడ్లను ధ్వంసం చేశారు.
శిలాఫలకం
ధ్వంసం పైశాచికం
అనపర్తి: జి.మామిడాడ సూర్యనారాయణమూర్తి ఆలయానికి సుమారు రూ.2 కోట్ల విరాళాలిచ్చిన దాత దివంగత మాజీ సర్పంచ్ చింతపండు అమ్మిరెడ్డి పేరును శిలాఫలకంపై నుంచి తొలగించడం పైశాచికమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ, భూరి విరాళాలిచ్చిన దాతలను సైతం అవమానిస్తూంటే సామాన్యుల పరిస్థితేమిటని ప్రశ్నించారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత దౌర్జన్యాలు, దాడులు తీవ్రతరమయ్యాయని ఆరోపించారు. సూర్యనారాయణస్వామి వారికి అమ్మిరెడ్డి సుమారు రూ.1.50 కోట్ల విలువైన బంగారు కిరీటం సమర్పించారని గుర్తు చేశారు. ఆయన మరణానంతరం సోదరుడు వెంకటరెడ్డి 2018లో సుమారు రూ.6.50 లక్షలతో ఆలయ ముఖద్వారంపై అశ్వాలతో కూడిన సూర్యనారాయణమూర్తి విగ్రహం ఏర్పాటు చేయించారని చెప్పారు. శిథిలావస్థకు చేరిన ధ్వజస్తంభానికి కూడా రూ.10 లక్షల విరాళం ఇచ్చారన్నారు. ఇవన్నీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనే జరిగాయని, శిలాఫలకం కూడా అప్పుడే వేశారని చెప్పారు. అయితే, ఈ పనులన్నీ వైఎస్సార్ సీపీ హయాంలోనే జరిగాయంటూ ఆయన పచ్చి అబద్ధాలు చెబుతున్నారని సూర్యనారాయణరెడ్డి దుయ్యబట్టారు. పట్టపగలు శ్రేష్ఠమైన ముహూర్తాన చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ కార్యక్రమాలపై అర్ధరాత్రి వేళ దొంగచాటుగా దాడులు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఆ రోజు శిలాఫలకాలపై అభ్యంతరం చెప్పని రామకృష్ణారెడ్డి, శిలాఫలకాలను ధ్వంసం చేయించడం దుర్మార్గమని విమర్శించారు. ఆయన నిజంగా సంబంధం లేకపోతే, శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే అక్కడ శిలాఫలకాన్ని యథాతథంగా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రామకృష్ణారెడ్డి వైఖరి వల్ల భవిష్యత్తులో ఏ దాతా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.


