బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో శనివారం నుంచి రహదారి భద్రతా వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి ఎంయూవీ మనోహర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాకినాడ, ఏలేశ్వరం, తుని డిపోలో ఈ నెల 25 నుంచి 31 వరకూ ఈ వారోత్సవాలు జరుగుతాయన్నారు. వారం రోజుల పాటు డ్రైవర్లకు వైద్య పరీక్షలు, రహదారి భద్రతా నియమాలపై శిక్షణ తరగతులు, ఉత్తమ డ్రైవర్లకు ప్రశంసా పత్రాలు ఇస్తామని అన్నారు.
పోక్సో కేసులో
నిందితుడికి మూడేళ్ల జైలు
పిఠాపురం రూరల్: పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు గీసాల నాగేశ్వరరావు (65)కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కాకినాడ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కె.శ్రీదేవి తీర్పు చెప్పారు. అలాగే బాధిత బాలికకు రూ.2 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. రూ.1,000 జరిమానాతో పాటు మూడు నెలల సాధారణ కారాగార శిక్ష విధించారు. ప్రభుత్వ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.శ్రీదేవి వాదనలు వినిపించగా, సాకా్‌ాష్ధరాల ఆధారంగా న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించింది. కేసు విచారణలో సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరచడంలో సీఐ జి.శ్రీనివాస్, ఎస్సై వి.మణికుమార్, కోర్టు హెడ్ కానిస్టేబుల్ విల్లా కిషోర్ చేసిన కృషిని ఉన్నతాధికారులు అభినందించారు.
ముగిసిన రీజియన్
హ్యాండ్‌బాల్ పోటీలు
పెద్దాపురం: పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయంలో మూడు రోజులుగా జరుగుతున్న హైదరాబాద్ రీజియన్ హ్యాండ్‌బాల్ పోటీలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. ఈ పోటీలకు దక్షిణాది రాష్ట్రాల్లోని నవోదయ విద్యాలయ సమితి క్రీడాకారులు హాజరయ్యారు. పీఈటీ జనార్దన్ నాయుడు మాట్లాడుతూ ఆఖరి రోజు జరిగిన మ్యాచ్‌ల్లో అండర్ 14, 17 బాలుర విభాగాల్లో కోలార్ క్లస్టర్, అండర్ 19 విభాగంలో కరీంనగర్ క్లస్టర్ విజేతలుగా, పోలవరం క్లస్టర్, రాయచూరు క్లస్టర్లు రన్నర్లుగా నిలిచాయన్నారు. అలాగే అండర్ 14, 17 బాలికల విభాగంలో కోలార్ క్లస్టర్, అండర్ 19లో పుదుచ్చేరి విజేతలుగా, చిక్కంగళూరు, అల్లపి రన్నర్లుగా నిలిచాయన్నారు. నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఎస్‌ఎస్ కీర్తి మాట్లాడుతూ ఈ పోటీల్లో గెలుపొందిన జట్లు ఆగస్టు 28న పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌కు వెళతాయని తెలిపారు. విజేతలకు ముఖ్య అతిథిలుగా హాజరైన ప్రముఖ వ్యాపారవేత్త మట్టే శ్రీనివాసరావు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు రీజియన్ మేనేజర్ రవికుమార్ గుప్తా ట్రోఫీలను బహూకరించారు. పారిశ్రామికవేత్త టి.ఉమాశంకర్, ఎన్‌సీసీ ఆఫీసర్ ఎస్.సత్యనారాయణ, పీఈటీలు చక్రవర్తి, అనురాధ, పి.రామారావు, ప్రేమలత పాల్గొన్నారు.
విద్యార్థి సంఘాల బంద్
విజయవంతం
బాలాజీచెరువు: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన బంద్ విజయవంతమైంది. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై.బాబి, విద్యార్థి జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బుల్లిరాజు తదితరులు మాట్లాడుతూ గత 14 ఏళ్లలో 116 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయని ఆరోపించారు. నీట్ లీకేజీపై 45 రోజులుగా నిరసనలు తెలుపుతున్నా, 21 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా, కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీఛార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పీడీఎస్‌యూ, డీఐవైఎఫ్ నాయకులు సిద్ధూ, టి.రాజా, ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు గమినివేలు, సత్యం, కరుణ్ కుమార్ పాల్గొన్నారు.
విద్యార్థులకు దుర్వాసన
వచ్చే భోజనమా!
కొత్తపల్లి: పాఠశాలలో విద్యార్థులకు దుర్వాసన వచ్చే భోజనం పెట్టడంపై ఓ విద్యార్థి తల్లి వాపోయింది. స్థానిక జిల్లా బాలికల పరిషత్ పాఠశాలలో శుక్రవారం పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో రుచి, శుచిలేని భోజనాన్ని పిల్లలకు పెట్టడంపై తల్లిదండ్రుల సమావేశానికి హాజరైన ఓ తల్లి నాయకులను, అధికారులను, ఉపాధ్యాయులను నిలదీసింది. ఇటువంటి భోజనం పెట్టడం వల్ల అనారోగ్యానికి గురైతే బాధ్యులెవరంటూ ప్రశ్నించింది. నాసిరకం భోజనం తయారు చేస్తున్న ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని కోరింది.


