● కలవరపెడుతున్న ప్రమాదాలు
● మానవ తప్పిదాలు తోడవుతున్న
ప్రభుత్వ వైఫల్యం
కపిలేశ్వరపురం: కారులో షికారు ఓ మధురానుభూతి. ఆ అనుభూతిని తీరుస్తున్న కారే శకటంగా మారితే... ఆవిరైపోయేది ప్రాణాలే కాదు.. వారిపై ఆధారపడిన కుటుంబాల ఆనందం కూడా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2025లో 2,258 వాహన ప్రమాదాలు సంభవించగా 883 మంది మృత్యువాత పడ్డారు. అందులో కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో 382 కారు ప్రమాదాలు జరిగాయి. ఉమ్మడి జిల్లాలో కారు ప్రమాదాలు పై కథనం..
ప్రభుత్వ వైఫల్యంతో..
ప్రభుత్వం ఒక పక్క మద్యం విక్రయాలతో ఆదాయాన్ని ఆర్జిస్తుండగా దాని ప్రభావంతో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రహదారులపై సైన్‌బోర్డులు, అప్రోచ్‌రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వంటి లోపాలనేకం ప్రభుత్వ వైఫల్యాన్ని పట్టిచూపుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో ప్రమాదాల్లో కొన్ని..
కాకినాడ జిల్లాలో 2025లో 803 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 330 మంది చనిపోయారు. అందులో 185 కారు ప్రమాదాలు కాగా 65 మంది చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో 837 ప్రమాదాల్లో 328 మంది చనిపోయారు. అందులో 197 కారు ప్రమాదాలు. కోనసీమ జిల్లాలో 618 ప్రమాదాలకు గానూ 225 మంది మృత్యువాత పడ్డారు.
దుర్ఘటనలు ఇలా..
● ఈ ఏడాది ఫిబ్రవరి 1న దివాన్ చెరువు పెట్రోల్ బంక్ సమీపంలో కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రాజానగరం జీఎస్‌ఎల్ వైద్య కళాశాల విద్యార్థిని మృతిచెందింది.
● ఫిబ్రవరి 9న గొల్లప్రోలు మండలం వన్నెపూడి–కొడవలి జంక్షన్ వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొని పల్టీలు కొట్టిన ప్రమాదంలో వాటిల్లో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.
● ఫిబ్రవరి 14న దేవరపల్లి మండలం కొత్తగూడెం సమీపంలో యాదవోలు రోడ్డు వద్ద రాంగ్ రూట్‌లో వెళ్తున్న కారు బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
● ఫిబ్రవరి 20న రాజవొమ్మంగి మండలం జడ్డంగి శివారు మడేరువాగు సమీపంలో కారు అదుపు తప్పి బోల్తాపడగా అందులో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందారు.
● ఫిబ్రవరి 22న చింతూరు మండలం సింగన్నగూడెం వద్ద కారు రహదారి రెయిలింగ్‌పైకి దూసుకుపోయిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు.
● మార్చి 22న కాకినాడ–పిఠాపురం రోడ్డులో తిమ్మాపురం వద్ద కారు ఎదురుగా వెళ్తున్న బైక్, స్కూటీలను ఢీకొనడంతో ఏడుగురు గాయపడ్డారు.
● మార్చి 22న దేవరపల్లి మండలం యర్నగూడెం జాతీయ రహదారిపై గండి చెరువు సమీపంలో కారు అదుపు తప్పి మరో రెండు కార్లను ఢీకొనగా ముగ్గురు మృత్యువాత పడ్డారు.
● ఈ నెల 6న తెలంగాణ ప్రాంతంలో కారు భారీ వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ధవళేశ్వరం పంచాయతీలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ దంపతులు దుర్మరణం పాలయ్యారు.
● ఈ నెల 6న అర్ధరాత్రి మండపేట మండలం పేకేటిపాకలు వద్ద కాలువలోకి కారు బోల్తాపడిన ప్రమాదంలో యువజంట చనిపోయారు.
కారణాలనేకం
ఉమ్మడి జిల్లాలో సగటున రోజుకు ఆరు ప్రమాదాలు జరుగుతుండగా వాటిలో ఇద్దరు చనిపోతున్నారన్నది ఓ విశ్లేషణ. 2025లో అతివేగంగా వాహనం నడుపుతున్న కేసులు కాకినాడ జిల్లాలో 10,737, తూర్పుగోదావరి జిల్లాలో 791 కేసులు నమోదయ్యాయి. 18 ఏళ్లలోపు వారు వాహనాన్ని నడపడం నేరం. వారికి వాహనాన్ని ఇచ్చినవారే బాధ్యులవుతారు. ఆ నేరంపై కాకినాడ జిల్లాలో 350, తూర్పుగోదావరి జిల్లాలో 388 కేసులు నమోదయ్యాయి. సెల్‌ఫోన్ చూస్తూనో, మాట్లాడుతూనో డ్రైవింగ్ చేసిన నేరంపై 2025లో తూర్పుగోదావరి జిల్లాలో 1,843, కాకినాడ నగరంలో 510 కేసులు నమోదయ్యాయి. డ్రంకెన్ డ్రైవ్ కేసులు 2025లో కోనసీమ జిల్లాలో 3,500, కాకినాడ జిల్లాలో 7,578 నమోదయ్యాయి.
స్థానికుల స్పందన కీలకం
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి ప్రాణాలను కాపాడటం కీలకం. ఈ నెల 6న పేకేటిపాకలు వద్ద కాలువలోకి కారు బోల్తాపడిన ఘటనలో స్థానికులు స్పందించి నలుగురి ప్రాణాలు కాపాడారు.
– పి.దొరరాజు, సీఐ, మండపేట రూరల్,
తూర్పుగోదావరి జిల్లా.


