– మాజీ ఎంపీ వంగా గీత
పిఠాపురం: ఈదురు గాలులు, అకాల వర్షాల వల్ల పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎంపీ వంగా గీత డిమాండ్ చేశారు. ఆమె శుక్రవారం అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న గొల్లప్రోలు మండలం చేబ్రోలు, మల్లవరం ప్రాంతాల్లో పర్యటించారు.రైతులను అడిగి నష్టాలను తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ రైతులకు జరిగిన నష్టం పూడ్చలేనిదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికి అందే దశలో భారీ నష్టం జరగడం బాధాకరమన్నారు. ప్రభుత్వం పంట నష్టం నమోదు చేయాలన్నారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందజేయాలని, అన్ని పంటలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించామన్నారు. ఒక పక్క వాణిజ్య పంటలతో పాటు మరో పక్క కోత దశలో ఉన్న వరి పంట పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉన్నందున రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గతంలో రైతులకు అందాల్సిన ఇన్‌ఫుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదని, కౌలు రైతులకు ఏవిధమైన ప్రభుత్వ సహకారం అందడం లేదన్నారు. అధికారులు సలహాలు ఇవ్వడం కాకుండా జరిగిన నష్టాలకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆమె వెంట జెడ్పీటీసీ సభ్యుడు ఉలవకాయల నాగ లోవరాజు, వైఎస్సార్ సీపీ గొల్లప్రోలు మండల అధ్యక్షుడు అరిగెల రామయ్యదొర ఉన్నారు.


