ఊరించి.. ఉసూరుమనిపించి.. | - | Sakshi
Sakshi News home page

ఊరించి.. ఉసూరుమనిపించి..

Mar 20 2026 8:01 AM | Updated on Mar 20 2026 8:01 AM

రాష్ట్రవ్యాప్తంగా ఖాళీ పోస్టులు 90 వేలు గతంలో అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం

ఇప్పుడు 10 వేల పోస్టులతోనే జాబ్‌ క్యాలెండర్‌ మండిపడుతున్న నిరుద్యోగులు

పిఠాపురం: ‘ఎన్ని పట్టాలు నాకొచ్చినా.. ఒక్క పూట బువ్వ నాకెట్టలే.. ఎంత ఇష్టంగా నే చదివినా నా కష్టమే తీర్చలే.. ఆశతో నేనెంతో చదువుకున్నా.. నిరాశతో నే బతుకుతున్నా..’ అంటూ నిరుద్యోగి ఆవేదనను తెలిపేలా ఓ గాయకుడు పాడిన పాట.. చంద్రబాబు సర్కారు తీరును చూస్తే నిజమనిపించక మానదు. ఉద్యోగం పురుష లక్షణం అనే వారు ఒకప్పుడు. కానీ ప్రస్తుతం నిరుద్యోగం సీ్త్ర, పురుష లక్షణంగా మారింది. చదువుకోవడం తప్ప ఉద్యోగాలు రాక వేలాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేకపోతే ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం మానేశారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఆయన తనయుడు నారా లోకేష్‌ యువగళం పేరుతో నిర్వహించిన పాదయాత్రలో ఉద్యోగ అవకాశాలపై పలుచోట్ల హామీలు ఇచ్చారు. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని గొప్పగా చెప్పారు. తీరా చూస్తే అధికారంలోకి వచ్చిన తరువాత ఉన్న ఉద్యోగాలు తొలగించడం తప్ప.. కొత్త ఉద్యోగాలివ్వడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. ఇచ్చేది గోరంత.. ప్రచారం కొండంత అన్నట్టుగా ప్రభుత్వ తీరు ఉంది. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పారు. ఒక ఏడాది గడచిపోగా.. రెండో ఏడాది కేవలం 10 వేల పోస్టులతో అరకొరగా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

5.3 లక్షల నిరుద్యోగ సైన్యం

ఉగాదికి కొత్త జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని ప్రభుత్వం విస్తృత ప్రచారం చేసింది. అసెంబ్లీ సాక్షిగా 90 వేలకు పైగా ఖాళీ పోస్టులున్నట్లు ప్రకటించింది. తీరా చూస్తే అన్ని విభాగాల్లో ఉన్న వేలాది ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా కేవలం 10 వేల పోస్టులతో మాత్రమే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది. జిల్లా జనాభా 22,47,680. జిల్లావ్యాప్తంగా 5,33,908 కుటుంబాలున్నాయి. ఇంటికొకరు చొప్పున లెక్క వేసినా జిల్లాలో 5.3 లక్షల మందికి పైగానే నిరుద్యోగులున్నారు. ఒక్క జిల్లాలోనే ఇంత మంది నిరుద్యోగులుండగా.. రాష్ట్రమంతటికీ కలిపి కేవలం 10 వేల పోస్టులతో మాత్రమే ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు ఎన్నికల హామీ మేరకు ఉద్యోగం ఇవ్వకపోగా.. కనీసం రూ.3 వేల భృతి వరకే తీసుకున్నా ప్రతి నెలా ప్రభుత్వం రూ.150 కోట్లకు పైగా చెల్లించకపోవడంపై కూడా నిరుద్యోగులు నిరసన గళం వినిపిస్తున్నారు.

వలస బాట

అటు ప్రభుత్వం వివిధ పోస్టులు భర్తీ చేయకపోగా.. ఇటు ప్రైవేట్‌ రంగంలోనూ ఉద్యోగాలు నామమాత్రంగానే దక్కుతున్నాయి. చదువుకున్నా ఇక్కడ ఉద్యోగాలు దొరకని పరిస్థితుల్లో అనేక మంది తల్లిదండ్రులకు దూరంగా హైదరాబాద్‌, చైన్నై, బెంగళూరు, ముంబై వంటి సుదూర ప్రాంతాలకు పొట్ట చేత పట్టుకుని వలస పోవాల్సి వస్తోంది. జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యాన కొన్నేళ్లుగా ప్రభుత్వ నియామకాలు జరగడమే లేదు. వాటిల్లో నమోదు చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చాలా మంది గత్యంతరం లేక ప్రైవేటు సంస్థల్లో చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అరకొర వేతనాలతోనే జీవనం సాగిస్తున్నారు.

అన్ని పోస్టులూ భర్తీ చేయాలి

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఇప్పటి వరకూ ఇస్తామన్న జాబ్‌ క్యాలెండర్‌ ఊసే లేదు. ఇప్పుడు అరకొరగా కేవలం 10 వేల ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి అదే గొప్పగా చెప్పుకొంటున్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో 90 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు చెప్పింది. దీని ప్రకారం చూసినా ఇంకా 80 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టే కదా! ఏళ్ల తరబడి ఉద్యోగాలివ్వకపోవడంతో అనేక మంది జీవితాంతం నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. ఇప్పటికై నా ఇచ్చిన హామీ ప్రకారం పూర్తి స్థాయిలో పోస్టులు భర్తీ చేయాలి.

– ఎం.గంగా సూరిబాబు,

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి, కాకినాడ

బాబు వచ్చారు.. జాబు పోయింది

జాబు కావాలంటే బాబు రావాలని, తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలిస్తామని గత ఎన్నికల్లో చంద్రబాబు హామీలు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోగా.. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ఉద్యోగులను తొలగించారు. వలంటీర్లు, ప్రభుత్వ మద్యం షాపుల్లో పని చేస్తున్న వారు, ఏపీ ఫైబర్‌నెట్‌, ఏపీఎండీసీ కాంట్రాక్టు వర్కర్లు, యానిమేటర్లు, ఆశా కార్యకర్తలు, స్కూల్‌ ఆయాల వంటి వారు వీరిలో ఉన్నారు. వీరందరూ చంద్రబాబు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వలంటీర్లకు రూ.5 వేలు కాకుండా రూ.10 వేలు ఇస్తామన్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ల హామీ గాల్లో కలిసిపోయింది. సేవా సారథులుగా నిలిచిన వలంటీర్లను చివరకు రోడ్డు పైకి నెట్టేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement