అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో కరూర్ వైశ్యా బ్యాంక్ సమకూర్చిన కియోస్క్ సెల్ఫ్ సర్వీస్ మెషీన్లను అన్నవరం దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ త్రినాథరావు గురువారం ప్రారంభించారు. ఈ మెషీన్ల ద్వారా అంతరాలయ దర్శనం, వ్రతాలు, కల్యాణం, ప్రసాదం, కేశఖండన తదితర టిక్కెట్లను భక్తులు త్వరితగతిన పొందవచ్చని తెలిపారు. వీటిని రోశయ్య మండపం వద్ద, పశ్చిమ రాజగోపురం ఎదురుగా విశ్రాంతి మండపం వద్ద ఏర్పాటు చేశారు.
టిక్కెట్లు పొందాలిలా..
కియోస్క్ స్క్రీన్‌పై భక్తులు తమ ఫోన్ నంబర్ టైపు చేయాలి. అనంతరం అంతరాలయ దర్శనం, వ్రతాలు, కల్యాణం, ప్రసాదం సేవలు దర్శనమిస్తాయి. వాటిలో ఏ సేవ కావాలో ఎంచుకుంటే ఎన్ని టికెట్లనే ఆప్షన్ వస్తుంది. దానిపై టిక్ చేశాక ఎంత చెల్లించాలో స్క్రీన్ మీద కనిపిస్తుంది. అక్కడ ఒక ఫోన్‌పే నంబర్ కూడా వస్తుంది. ఆ నంబర్‌కు ఆ మొత్తం ఫోన్‌పే చేస్తే టికెట్లు వస్తాయి. ఈ మెషీన్లు ఎలా ఉపయోగించాలో తెలియకపోతే మాత్రం భక్తులకు ఇబ్బంది తప్పదు. అందువలన ఇక్కడ వీటి వినియోగం తెలిసిన ఓ ఉద్యోగిని ఉంచితే మేలనే అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు పశ్చిమ రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన మెషీన్ల వద్ద ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ మనమిత్ర అని, దాని ఫోన్‌పే నంబర్ కనిపిస్తోంది. ఆ నంబర్‌కు అమౌంట్ పంపిస్తే మాత్రం ఇబ్బంది తప్పదు. వీటిని అధికారులు సరి చేయాల్సి ఉంది.
గేట్‌లో 84వ ర్యాంక్
సామర్లకోట: పట్టణానికి చెందిన తెలగరెడ్డి సాయి ప్రసన్న కుమార్ గేట్ 2026లో ఆలిండియా 84వ ర్యాంక్ సాధించాడు. ప్రస్తుతం ఈ విద్యార్థి దుర్గపూర్‌లో బీటెక్ చదువుతున్నాడు. గతంలో కేఎస్‌ఎన్ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. సామాన్య కుటుంబంలో పుట్టిన ప్రసన్న కుమార్ గేట్‌లో 84వ ర్యాంక్ సాధించడం పట్ల పలువురు ఫోన్‌లో అభినందనలు తెలిపారు. ప్రసన్న కుమార్ తండ్రి వీరభద్రరావు రోజు కూలీగా పని చేస్తూ కుమారుడిని చదివిస్తున్నాడు. తల్లి భూచక్రవేణు గృహిణి. తమ కుమారుడు మంచి ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.


