
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
తుని: జాతీయ స్థాయిలో జరిగే అటియా పాటియా చాంపియన్‌షిప్ పోటీలకు కాకినాడ జిల్లా నుంచి పలువులు విద్యార్థులు ఎంపికై నట్లు అటియా పాటియా జిల్లా అధ్యక్షుడు జీవీవీ సత్యనారాయణ గురువారం తెలిపారు. అండర్–17 జిల్లా బాలుర జట్టు నుంచి ఆర్.ఆనందకుమార్, ఎ.అరవింద్, బాలికల జట్టు నుంచి డి.గంగాలక్ష్మి, కె.శ్రీలక్ష్మిపూజ, సీహెచ్ ఉమాశైలేంద్రి, పీఆర్‌ఎస్‌ఎల్ గంగాదేవి ఎంపికయ్యారన్నారు. వీరు అక్టోబర్ మొదటి వారంలో మహారాష్ట్రలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. విజేతలను పలువురు అభినందించారు.
ఉపాధి ఽశిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత ఉపాధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కాకినాడ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జీవీకే వర్మ గురువారం తెలిపారు. అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, ఫీల్డ్ టెక్నీషియన్ ఎయిర్ కండీషనర్‌పై మూడు నెలల పాటు శిక్షణ ఇస్తామని, 16 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. పదో తరగతి లేదా ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాలకు 87907 98431 ఫోన్ నంబరులో సంప్రదించాలని సూచించారు.
ఒక్క రూపాయికే
బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ కార్డు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కేవలం ఒక్క రూపాయికే సిమ్ కార్డు అందించి, మొదటి నెలలో 30 రోజుల అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు రోజుకు 2 జీబీ డేటా ఉచితంగా ఇస్తున్నట్లు భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) రాజమహేంద్రవరం బిజినెస్ ఏరియా ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పలివెల రాజు అన్నారు. ఈ సరికొత్త ఫ్రీడమ్ ప్లాన్ ఈ నెలాఖరు వరకే ఉంటుందన్నారు. రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ సమీపంలో గల నన్నయ సంచార భవనం కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తక్కువ రీచార్జి ప్లాన్లతో మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఏజెన్సీలో కూడా టవర్స్ అదనంగా పెట్టి ఫ్రీక్వెన్సీ పెంచామన్నారు. సమావేశంలో డీజీఎంలు సత్యనారాయణ, శైలజ, ఏజీఎంలు భమిడి శ్రీనివాస్, శారద, జయశ్రీ పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా
లక్ష రుద్రాక్ష పూజ
ఐ.పోలవరం: నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారికి గురువారం లక్ష రుద్రాక్ష పూజా మహోత్సవం అత్యంత శాస్త్రోక్తంగా జరిగింది. శ్రావణ మాసం మాస శివరాత్రి మహా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 15 మంది రుత్విక్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారణాసి నుంచి తెచ్చిన రుద్రాక్షలను మేళతాళాలతో గ్రామోత్సవం జరిపి, గోదావరి వద్ద ప్రత్యేక పూజలు, సంప్రోక్షణ చేశారు. 728 మంది భక్తులు గోత్ర నామాలు నమోదు చేసుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్, కార్య నిర్వాహణాధికారి వి.సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు అల్పాహారం, అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. కార్యక్రమం తిలకించేందుకు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. భక్తులకు రుద్రాక్షలు ప్రసాదంగా అందజేశారు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక