
సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీల ధర్నా
కాకినాడ సిటీ: అంగన్‌వాడీలకు ఇబ్బంది కలిగించే ఎఫ్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలని, 5జీ టెక్నాలజీతో ఉన్న కొత్త సెల్‌ఫోన్లు ఇవ్వాలంటూ గురువారం కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నగరంలోని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి మాట్లాడుతూ ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్ వల్ల అంగన్‌వాడీ వర్కర్లతో పాటు లబ్ధిదారులు, బాలింతలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి అంగన్‌వాడీలకు వేతనాలు పెంచలేదన్నారు. 2024లో 42 రోజుల సమ్మె అనంతరం మినిట్స్‌లో నమోదు చేసినటువంటి అంశాల అమలుకు ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదన్నారు. తక్షణమే పెరిగిన ధరలకనుగుణంగా కనీస వేతనాలు చెల్లించాలని అన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అర్బన్ తహసీల్దార్ జితేంద్రకు అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, కో కన్వీనర్ మేడిశెట్టి వెంకటరమణ, అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ కాకినాడ అర్బన్ ప్రాజెక్టు అధ్యక్షురాలు ఎం.విజయ, జి.రమణమ్మ, సరోజని, వసంత, సత్య, వరలక్ష్మి, అపర్ణ, రమాదేవి, రమ, శేషు, శ్రీదేవి, రామలక్ష్మి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.