
ఇటువడి..అటుజడి
● కొనసాగుతున్న వర్షం
● పెరుగుతున్న వరద
● ముంపు బారిన వరి చేలు
● లంకల్లో ప్రజలు బిక్కుబిక్కు
సాక్షి, అమలాపురం: గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఒకవైపు గోదావరికి వరద పోటు తగిలింది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. వరద.. వర్షంతో ప్రస్తుతానికి ఇబ్బంది లేకున్నా, వీటి ఉధృతి పెరిగితే లంక, కొన్ని మైదాన ప్రాంతాలు ముంపు బారిన పడే ప్రమాదం ఉంది.
గోదావరి ఎగువన కురుస్తున్న వర్షాలకు శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ వరద పెరిగింది. ఆదివారం ఉదయం స్వల్పంగా తగ్గిన వరద మధ్యాహ్నం నుంచి క్రమేపీ పెరుగుతోంది. సోమవారం వరకూ వరద పెరుగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి శనివారం రాత్రి 4,25,594 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. ఆదివారం ఉదయానికి కొంత మేర తగ్గింది. ఉదయం ఆరు గంటల సమయంలో ఽఇది 4,04,890 క్యూసెక్కులకు తగ్గింది. తిరిగి వరద పెరుగుతూ సాయంత్రం ఆరు గంటలకు 4,84,214 క్యూసెక్కులకు చేరింది. ఎగువన భద్రాచలం వద్ద నీటమట్టం పెరుగుతుండడంతో సోమవారం సాయంత్రానికి ఐదు నుంచి ఆరు లక్షల క్యూసెక్కుల మధ్యలో వరద వచ్చి, తరువాత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షం పడితే వరద మరింత పెరుగుతోందని అంటున్నారు. శుక్రవారం ఉదయం ఇన్‌ఫ్లో కేవలం 2,29,910 క్యూసెక్కులు మాత్రమే ఉండగా, 24 గంటల వ్యవధిలో 1.74 లక్షల క్యూసెక్కుల వరద పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. వరద ప్రభావం నదీపాయల్లో కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల లంకలను తాకుతూ ప్రవహిస్తోంది. అయితే ప్రతి ఏటా ఆగస్టులో గోదావరిలో నమోదయ్యే సగటు ఇన్‌ఫ్లోతో పోల్చుకుంటే ఇప్పుడు గోదావరికి వచ్చిన వరద అసలు వరద కాదని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.
నీటి విడుదల తగ్గింపు
డెల్టా పంట కాలువలకు నీటి విడుదల తగ్గించారు. ఈ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో ప్రస్తుతం తూర్పు డెల్టాకు 2 వేల క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 200, పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల చొప్పున మొత్తం 2,700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఈ నెల 14న వరకూ 4,550 క్యూసెక్కుల వరకూ నీరు వదలగా వర్షాలతో తగ్గించేశారు.
మరో రెండు అల్పపీడనాలతో..
జిల్లాలో ఆది, సోమవారాల్లో భారీ వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కూడా తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.