
తుపాన్ హెచ్చరికతో అప్రమత్తం
● నేడు పీజీఆర్‌ఎస్ రద్దు
● కలెక్టర్ షణ్మోహన్
కాకినాడ సిటీ: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఈ అల్పపీడనం వచ్చే 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవదని హెచ్చరికలు జారీ చశారు. ప్రజలందరూ తమ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలన్నారు. జిల్లాలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)ను రద్దు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.
మూడో నంబర్
ప్రమాద హెచ్చరిక జారీ
కాకినాడ సిటీ/కాకినాడ రూరల్: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో కాకినాడ పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు ఐదు రోజుల పాటు వేటకు వెళ్లొద్దని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో టాంటాంల ద్వారా సమాచారాన్ని తెలియజేస్తున్నారు. అధికారులు మత్స్యకార గ్రామాల్లోనే ఉండాలని కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు జారీ చేశారు.
సముద్రంలో ఉన్నవారు ఒడ్డుకు చేరాలి
జిల్లాలో మత్స్యకారులు చాలా వరకు ఒడ్డుకు చేరుకున్నారని, ఇంకా సముద్రంలో ఉన్నవారిని ఒడ్డుకు చేరుకోవాలని సమాచారం ఇచ్చినట్టు మత్స్యశాఖ అధికారి కృష్ణారావు తెలిపారు.
అరకొర పథకాలు మాత్రమే
● వైఎస్సార్ సీపీ మహిళా విభాగం
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగమణి
కాకినాడ రూరల్: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలంటూ గొప్పలు చెప్పుకుంటోందని వాస్తవానికి అరకొర పథకాలు మాత్రమే అమలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి పేర్కొన్నారు. పథకాల పేరుతో చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని, మహిళలకు రాష్ట్రంలో భద్రత లేకుండా పోయిందని ఆదివారం ఆమె మీడియా ద్వారా తెలియజేశారు. ఉచిత బస్సు, దీపం వంటి పథకాలు సంపద సృష్టించి ఇవ్వలేదని విద్యుత్ చార్టీల టారీఫ్‌లు పెంచి, ప్రజలపై ఆ భారం మోపి రూ.30 వేల కోట్లు వసూలు చేసి వాటితో అరకొరగా అమలు చేస్తున్నారన్నారు. ఉచిత బస్సులు నియోజకవర్గానికి ఒక్కటి కూడా లేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు పెద్ద పీట వేసి వారి ఆర్థిక పరిపుష్టికి భరోసా కల్పించాన్నారు.
పంపాకు తగ్గని వరద
● వచ్చిన నీరు వచ్చినట్టే
సముద్రంలోకి విడుదల
● 99 అడుగుల వద్ద నీటిమట్టం
అన్నవరం: అన్నవరంలోని ‘పంపా’ రిజర్వాయర్ లోనికి ఆదివారం కూడా భారీగా వరద నీరు వస్తుండడంతో అధికారులు దాదాపు 1,200 క్యూసెక్కుల నీరు సముద్రానికి విడుదల చేశారు. ఫలితంగా నీటిమట్టం 99 అడుగల వద్ద స్థిరంగా ఉంది. పంపా రిజర్వాయర్ గరిష్ట నీటి నిల్వ 0.43 టిఎంసీ కాగా, ప్రస్తుతం 0.29 టీఎంసీ నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. నీటిమట్టం పెరిగితే మరంత నీటిని విడుదల చేస్తామని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.

తుపాన్ హెచ్చరికతో అప్రమత్తం