కలిసొచ్చిన ముహూర్తం | - | Sakshi
Sakshi News home page

కలిసొచ్చిన ముహూర్తం

Aug 18 2025 6:11 AM | Updated on Aug 18 2025 6:11 AM

కలిసొచ్చిన ముహూర్తం

కలిసొచ్చిన ముహూర్తం

కడియపులంక పువ్వుల మార్కెట్‌కు కళ

ఆకాశాన్నంటిన ధరలు

బంతి కిలో రూ.150

కడియం: కడియపులంకలోని అంతర్రాష్ట్ర పువ్వుల మార్కెట్‌కు ముహూర్తం కలిసొచ్చింది. శుభకార్యాలకు ఈ నెలలో ఆదివారంతో ముహూర్తాలు అయిపోవడంతో.. నాలుగు రోజులుగా మార్కెట్‌లో పువ్వుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. ఎప్పుడూ లేనంతగా బంతి పువ్వుల ధర కిలో రూ.150 వరకు పలకడంతో విస్తుపోతున్నారు. శుభకార్యాల సందర్భంగా అలంకరణలకు ఇతర ప్రత్యేక రకాల పువ్వులు లేకపోవడంతో బంతి పువ్వులనే ప్రధానంగా వినియోగిస్తున్నారు. దీంతో వీటి ధరలు పెరిగాయని విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు స్థానికంగా పువ్వుల దిగుబడి గణనీయంగా తగ్గింది. జాజులు, లిల్లీలు, మల్లెలు, కనకాంబరం వంటి రకాలు మాత్రమే ఇక్కడ ప్రస్తుతం ఉత్పత్తి అవుతాయని, బంతి, చామంతి వంటి ముఖ్యమైన పువ్వులను కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. గతంలో తగిన ధరల్లేక కాలువల్లో పారబోసిన బంతి పువ్వులకు ఇప్పుడు డిమాండ్‌ భారీగా పెరగడం, సాగులో అనిశ్చితికి నిదర్శనమంటున్నారు.

నాలుగు రోజులుగా..

ఒకవైపు శ్రావణ మాసం, మరోవైపు ముహూర్తాల నేపథ్యంలో గురు, శుక్ర, శని, ఆదివారాల్లో కడియపులంక పువ్వుల మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం మధ్యాహ్నం సమయానికే పువ్వులు లేకపోవడంతో మార్కెట్‌ నిర్మానుష్యంగా మారిపోయింది. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి దాదాపు పది టన్నులకు పైగా బంతి, చామంతి పువ్వులు ఇక్కడకు వస్తే, గంటల వ్యవధిలోనే అవన్నీ అమ్ముడయ్యాయని వ్యాపారులు తెలిపారు. ఆదివారంతో వివాహాలు, గృహ ప్రవేశాలకు ముహూర్తాలు అయిపోయాయని, తిరిగి సెప్టెంబర్‌ 23 తర్వాతే ముహూర్తాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. చివరి ముహూర్తాలు కావడంతో పువ్వులకు భారీగా డిమండ్‌ ఏర్పడిందంటున్నారు.

ధరలు ఇలా..

కడియపులంక పువ్వుల మార్కెట్‌లో ఆదివారం స్థానికంగా లభించే లిల్లీ పువ్వులు కిలో రూ.500, మల్లెలు రూ.1300–రూ.1500, జాజులు రూ.700–రూ.900 పలికాయి. అలాగే కర్నాటక నుంచి వచ్చిన బంతి పువ్వులు రూ.120–రూ.150 వరకు విక్రయించారు. తమిళనాడు చామంతులు (తడి పువ్వులు) కిలో రూ.250–రూ.300, పొడి పువ్వులు రూ.350, వైట్‌ చామంతి రూ.250, నీలం చామంతి రూ.270, స్టార్‌ గులాబీలు కిలో రూ.240, కనకాంబరం బారు రూ.220 పలికాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement