
దోపిడీ కేసు గుట్టు రట్టు
● సెల్ సిగ్నల్స్ ఆధారంగా దర్యాప్తు
● ఐదుగురి అరెస్టు, చోరీ సొత్తు స్వాధీనం
పిఠాపురం: గత నెల 28న గొల్లప్రోలు మండలం చెందుర్తి రహదారిలో జరిగిన దారి దోపిడీ కేసును గొల్లప్రోలు పోలీసులు ఛేదించారు. సీఐ శ్రీనివాస్ శనివారం గొల్లప్రోలు పోలీసు స్టేషన్‌లో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజమహేంద్రవరం నల్లమందు వీధికి చెందిన సమీర్ ప్రజాపత్ అక్కడి భవానీ సిల్వర్స్‌లో గుమస్తాగా పనిచేస్తూ చుట్టుపక్కల ప్రాంతాల్లోని దుకాణాలకు బంగారం, వెండి వస్తువులను రవాణా చేస్తుంటాడు. విధి నిర్వహణలో భాగంగా ఆయన గత నెల 28న పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలులోని నగల దుకాణాల నుంచి బంగారం, వెండి, డబ్బులు తీసుకుని మోటార్ సైకిల్‌పై చెందుర్తి వెళ్తుండగా రాత్రి సుమారు 8 గంటల సమయంలో చెందుర్తి రోడ్డులో కల్వర్ట్ దగ్గర నలుగురు వ్యక్తులు 2 మోటార్ సైకిళ్లపై వచ్చి బ్లేడుతో బెదిరించి 51 గ్రాముల బంగారం, 12.5 కిలోల వెండి, రూ.60 వేల నగదు దోచుకుని పరారయ్యారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తుచేసిన పోలీసులు ఘటనాస్థలంలో సిగ్నల్స్ ఆధారంగా పెద్దాపురానికి చెందిన బంగారు నగల వర్తకుడు రౌతు గోవిందుపై నిఘా పెట్టారు. శనివారం పిఠాపురం మండలం జల్లూరు గ్రామ శివారులో అతనితో పాటు గనిరెడ్డి సాయి ప్రసాద్, కోన సాయిబాబు, బొమ్మను విజయ్ ఆనంద్, కుక్కల శివ మణికంఠ దోపిడీ చేసిన సొత్తును పంచుకుంటున్న సమయంలో గొల్లప్రోలు ఎస్సై రామకృష్ణ తన సిబ్బందితో దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా దోపిడీ చేసినట్టు అంగీకరించారు. వారి నుంచి దోచుకున్న సొత్తుతో పాటు వారు వినియోగించిన రెండు మోటారు సైకిళ్లు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. కాగా గోవిందు పెద్దాపురంలో బంగారు వెండి వ్యాపారం చేస్తుంటాడు. బాధితుడైన సమీర్ అతడితో కూడా లావాదేవీలు చేస్తుంటాడు. ఈ క్రమంలో సమీర్ వద్ద అధికమొత్తంలో బంగారం, వెండి ఉంటాయని, వాటిని కొట్టేయాలన్న దుర్బుద్ధితో అతడిపై తన మనుషులతో రెక్కీ నిర్వహించి పథకం ప్రకారం ఈ దోపిడీకి పాల్పడ్డాడని సీఐ తెలిపారు. దోపిడీ చేసిన వెండి, బంగారాన్ని కరిగించి దిమ్మలుగా మార్చి ఆనవాళ్లు లేకుండా చేశారని సీఐ తెలిపారు.

దోపిడీ కేసు గుట్టు రట్టు