ప్రజాస్వామ్యానికి సంకెళ్లా? | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యానికి సంకెళ్లా?

May 9 2025 12:12 AM | Updated on May 9 2025 12:12 AM

ప్రజా

ప్రజాస్వామ్యానికి సంకెళ్లా?

పత్రికా స్వేచ్ఛపై దాడే..

ఎటువంటి నోటీసూ ఇవ్వకుండా సాక్షి ఎడిటర్‌ ఆర్‌.ధనంజయరెడ్డి ఇంట్లో సోదాలు పత్రికా స్వేచ్ఛపై దాడిగానే భావించాల్సి వస్తుంది. తమకు అనుకూలంగా లేని పత్రికలపై పోలీసులను అడ్డం పెట్టుకుని లొంగదీసుకోవాలనుకోవడం అవివేకమైన చర్య. కార్డన్‌ సెర్చ్‌ పేరుతో సాక్షి దినపత్రిక సంపాదకుడి ఇంట్లో తనిఖీలు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించినట్లుగానే ఇండియన్‌ జర్నలిస్ట్స్‌ యూనియన్‌ (ఐజేయూ) భావిస్తోంది. ఈ దాడిని ఖండిస్తోంది. ఇంట్లోకి పోలీసులు బలవంతంగా చొరబడి తనిఖీలు చేసిన ధోరణి దిగ్భ్రాంతి కలిగించింది. పాత్రికేయులను భయపెట్టడానికి మాత్రమే పోలీసులు ఇలాంటి చర్యలను పూనుకుంటున్నట్లు భావిస్తున్నాం. సాక్షి పాత్రికేయులపై అక్రమ కేసులు సరి కాదు. సాక్షి యాజమాన్యంపై ఉన్న రాజకీయ వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని పోలీసులు సాక్షి జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటున్నట్లు భావించాల్సి వస్తోంది. ఈ తరహా తీరును ప్రభుత్వం మార్చుకోవాలి.

– స్వాతి ప్రసాద్‌,

ఐజేయూ జాతీయ సమితి సభ్యుడు, కాకినాడ

ప్రశ్నించే సాక్షి గొంతు నొక్కేస్తారా?

ఎడిటర్‌ ఇంట్లో చొరబాటు,

సోదాలు అన్యాయం

గళం విప్పిన జర్నలిస్టులు, ప్రజాసంఘాలు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసే విధానాలకు కూటమి ప్రభుత్వం స్వస్తి పలకాలని డిమాండ్‌ చేస్తూ జిల్లావ్యాప్తంగా ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు గురువారం నిరసనలు హోరెత్తించారు. ఎటువంటి సెర్చ్‌ వారెంట్‌ లేకుండా పోలీసులు.. విజయవాడలో సాక్షి సంపాదకులు ధనంజయరెడ్డి ఇంట్లోకి చొరబడి, అక్రమంగా సోదాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. సెర్చ్‌ వారెంట్‌ ఇవ్వకపోగా.. అది అడిగినందుకు డీఎస్‌పీ దురుసుగా ప్రవర్తించడం చూస్తూంటే.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రజల ముందుకు తీసుకువెళుతున్న సాక్షి గొంతు నొక్కే ప్రయత్నంలా ఉందని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ధ్వజమెత్తారు. అక్రమ సోదాలను ప్రజాసంఘాలు, పౌర సమాజం ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడలోని కలెక్టరేట్‌ సహా తుని, కోటనందూరు, ప్రత్తిపాడు, జగ్గంపేట, ఏలేశ్వరం, పెద్దాపురం, పెదపూడి తదితర ప్రాంతాల్లో జర్నలిస్టులు ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ నల్లబ్యాడ్జీలతో బ్లాక్‌డే పాటించి, నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెద్దాపురంలో ఆర్‌డీఓ శ్రీరమణికి, ఆయా మండలాల్లో తహసీల్దార్లు, పోలీసు అధికారులకు వినతిత్రాలు అందజేశారు.

ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఏపీయూడబ్లూజే జిల్లా నేతలు, కాకినాడ సిటీ ప్రెస్‌ క్లబ్‌ ప్రతినిధుల ఆధ్వర్యాన జర్నలిస్టులు కాకినాడ కలెక్టరేట్‌ మెయిన్‌ గేటు ఎదుట నల్లబ్యాడ్జీలతో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా అధ్యక్షులు అంజిబాబు, సాంబశివరావు మాట్లాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న సాక్షి పత్రిక పైన, పత్రిక సంపాదకులు ధనంజయరెడ్డి పైన వేధింపులు తగవని అన్నారు. ఎటువంటి సెర్చ్‌ వారెంట్‌ లేకుండా ఎడిటర్‌ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు చొరబడి తనిఖీలు నిర్వహించడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం ఇటువంటి చర్యల ద్వారా ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం అవివేకమే అవుతుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం లాంటి పత్రికలపై దాడులు, కక్షపూరిత చర్యలు సరికావని హితవు పలికారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఇటువంటి విధానాలు అప్రజాస్వామికమని ఖండించారు. సాక్షి ఎడిటర్‌ ధనంజయరెడ్డి నివాసంలో సోదాలు చేసిన పోలీసుల వైఖరిని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని విజ్ఞప్తి చేశారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే ఇటువంటి విధానాలను ప్రభుత్వాలు మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్‌, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు వీధి గోపీనాథ్‌, గోన సురేష్‌ కుమార్‌, సంయుక్త కార్యదర్శి చిక్కం పల్లంరాజు, కార్యవర్గ సభ్యులు కె.ధర్మరాజు, దడాల ప్రసాద్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ఉపాధ్యక్షుడు ఎం.ప్రకాష్‌, సీనియర్‌ జర్నలిస్టులు సబ్బెళ్ల శివనారాయణరెడ్డి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సాక్షి బ్యూరో చీఫ్‌ లక్కింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి టీవీ జర్నలిస్టు బొక్కినాల రాజు, కెమెరామెన్‌ రమణ, జర్నలిస్టులు తోట చక్రధర్‌, విశ్వనాథుల రాజబాబు, బొత్స వెంకట్‌, తలాటం సత్యనారాయణ, దొమ్మేటి నాగరాజు, కొమ్మిరెడ్డి శ్రీధర్‌, రాజకమల్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల తీరు అన్యాయం

సాక్షి ఎడిటర్‌ ధనంజయరెడ్డి ఇంట్లోకి చొరబడి పోలీసులు భయభ్రాంతులకు గురి చేయడం అన్యాయం. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపడం పత్రిక కనీస బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తిస్తున్న సాక్షిపై, ఆ పత్రిక ఎడిటర్‌పై అన్యాయంగా కేసులు పెడుతున్న తీరు సమర్థనీయం కాదు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు వ్యవస్థలో ఏ ఒక్క విభాగానికీ లేదనే విషయం గుర్తించాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకులు.. అందుకు భిన్నంగా పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజల గొంతుకై న పత్రికా స్వేచ్ఛను హరించడాన్ని ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలి.

– వి.నవీన్‌రాజు, ఏపీడబ్ల్యూజేఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కాకినాడ

ఏం సందేశం ఇద్దామని..!

విజయవాడలో సాక్షి ఎడిటర్‌ ఇంట్లోకి పోలీసులు సెర్చ్‌ వారెంట్‌ లేకుండా ప్రవేశించడం అన్యాయం. ఏదైనా విషయం ఉంటే చట్ట ప్రకారం సెర్చ్‌ వారెంట్‌ ఇచ్చి, సోదాలు చేసుకునే హక్కు పోలీసులకు ఉంటుంది. లేదంటే 41 నోటీసు ఇచ్చి చట్ట ప్రకారం విచారించవచ్చు. ఇవేమీ లేకుండా ఒక పత్రికా సంపాదకుని ఇంట్లోకి చొరబడడం, దురుసుగా ప్రవర్తించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఏ సందేశం ఇవ్వదలుచుకుందో అర్థం కావడం లేదు. ఇటీవల ఒక వార్తకు సంబంధించి సాక్షి ఎడిటర్‌తో సహా జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసిన విషయం మరవక ముందే ఇప్పుడు పోలీసులు వ్యవహరించిన తీరును సమాజం ఖండించాల్సిందే.

– తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి

ప్రజాస్వామ్యానికి సంకెళ్లా?1
1/3

ప్రజాస్వామ్యానికి సంకెళ్లా?

ప్రజాస్వామ్యానికి సంకెళ్లా?2
2/3

ప్రజాస్వామ్యానికి సంకెళ్లా?

ప్రజాస్వామ్యానికి సంకెళ్లా?3
3/3

ప్రజాస్వామ్యానికి సంకెళ్లా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement