చెయ్యి తడపాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

చెయ్యి తడపాల్సిందే!

Nov 12 2026 12:49 AM | Updated on Nov 12 2026 12:49 AM

గద్వాల క్రైం: అనుమతులు లేని వాహనాలకు జరిమానా విధించడంతో పాటు సీజ్‌చేసే అధికారం రవాణాశాఖ అధికారులకు ఉంది. ఈ నేపథ్యంలో కొందరు అధికారులు వాహనాల తనిఖీల పేరుతో అక్రమ వసూళ్లకు తెర తీస్తున్నారు. ఇప్పటికే జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి దండుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అయిజ మండలంలో వెలుగుచూసిన అక్రమ వసూళ్ల పర్వం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇదీ జరిగింది..

అయిజ మండలం తుపత్రాల గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు మిర్చి పంట సాగుచేశారు. వర్షా భావ పరిస్థితులతో పంట మొత్తం ఎండుముఖం పట్టింది. ఎలాగైనా పంటను కాపాడుకోవాలని సదరు రైతులు ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా పెద్దవాగు నుంచి నీటిని తరలించి, పంట పొలంలో పారిస్తున్నారు. ఈ క్రమంలో అయిజ – బల్గెర మార్గంలో మంగళవారం వాహనాల తనిఖీలు చేపట్టిన మోటారు వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌, హోంగార్డు వాటర్‌ ట్యాంకర్‌ను నిలిపివేశారు. వాహనానికి సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేవని గుర్తించిన సదరు అధికారి.. అనుమతులు లేకుండా వాహనం నడిపితే భారీ మొత్తంలో జరిమానాతో పాటు సీజ్‌ చేసి, కేసులు నమోదు చేస్తామని రైతులను హెచ్చరించారు. దీంతో పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్‌ ద్వారా నీటిని తరలిస్తున్నామని.. కేసులు, జరిమానా అంటే చెల్లించే స్థోమత లేదని వారు వేడుకున్నారు. చివరకు ట్యాంకర్‌ విడిచి పెట్టేందుకు ఇద్దరు రైతులు కలిసి రూ. 10వేలు ఇస్తే వదులుతామని తెలియజేయడంతో వారు నగదు అందజేశారు. ఈ తతంగాన్ని బాధిత రైతులు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. పంటను కాపాడేందుకు చేస్తున్న పొరాటంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం మనోవేదనకు గురిచేసిందని వాపోయారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌.. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని జిల్లా రవాణాశాఖ ఇన్‌చార్జి అధికారి రాధికను ఆదేశించారు.

అధికారుల తీరుపై విమర్శల వెల్లువ..

ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న వాహనాలతో పట్టుబడిన క్రమంలో అధికారులు వ్యవహరించే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాము చెప్పినట్లు మామూలు ఇస్తే సరే.. లేకుంటే భారీ మొత్తంలో జరిమానా రూపంలో విధిస్తారనే ఆరోపణలు ఉన్నాయి. జరిమానా కట్టినా ఆ వాహనం బయటకు రావాలంటే ఏజెంట్‌ ద్వారా వెళ్లాల్సిందే. మరోవైపు ఏజెంట్లు చెప్పినంత ఇవ్వకుంటే ఫైల్‌ అక్కడే ఉంటుంది. గతంలో ఓ బైక్‌ రిజిస్ట్రేషన్‌ విషయంలో అవకతవకలకు పాల్పడిన షోరూం నిర్వాహకుడితో పాటు ఆర్టీఏ ఏజెంట్‌, ముగ్గురు రవాణాశాఖ అధికారులపై కేసులు నమోదయ్యాయి. అలాగే నకిలీ ఇన్సురెన్స్‌ పత్రాలు సృష్టించి, రిజిస్ట్రేషన్‌ చేయించినట్లు వెలుగులోకి రావడంతో 16 మంది ఏజెంట్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

రూ.400 నుంచి

రూ.2వేల వరకు..

జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో ప్రతి ఫైల్‌కు రూ. 400 నుంచి రూ. 2వేల వరకు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వానికి పూర్తి ఫీజులు చెల్లించినప్పటికీ అధికారులు, సిబ్బంది చెయ్యి తడపాలనేది బహిరంగ రహస్యం. కార్యాలయ సమీపంలో దుకాణాలు ఏర్పాటుచేసుకున్న ఆర్టీఏ ఏజెంట్ల ద్వారా ఫైల్‌ వెళ్తే ఎలాంటి కొర్రీలు లేకుండా చకచకా అనుమతులు లభిస్తాయి. ఎవరైనా వాహనదారుడు నేరుగా వెళ్తే మాత్రం సవాలక్ష ప్రశ్నలు, కావాల్సిన పత్రాలు లేవనే సాకుతో కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటారు. అయితే ఇటీవల ఓ ఏజెంట్‌ అక్రమ వసూళ్లపై బహిరంగంగా మాట్లాడిన వీడియో వైరల్‌ అయింది. కొన్ని రోజుల తర్వాత ఆ ఏజెంట్‌ కార్యాలయంలో విధులకు ఆటంకం కలిగించాడని రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైన విషయం తెలిసిందే.

జిల్లా రవాణాశాఖలో అక్రమ వసూళ్ల జోరు

వాహనాల తనిఖీల పేరుతో దందా

తాజాగా రైతుల నుంచి రూ.10వేలు వసూలు

సామాజిక మాధ్యమాల్లోవైరల్‌గా మారిన వైనం

విచారణకు ఆదేశించిన కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement