గద్వాల: ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే బియ్యం విక్రయించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అన్నారు. బుధవారం ఐడీఓసీలోని అదనపు కలెక్టర్ చాంబర్‌లో బియ్యం వ్యాపారులు, రైస్‌మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బియ్యం అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ కృత్రిమ కొరత సృష్టించి.. దురుద్దేశంతో ధరలు పెంచే కార్యకలాపాలపై పటిష్ట నిఘా ఉంచనున్నట్లు తెలిపారు. బీపీటీ, కేఎన్‌ఎం రకం బియ్యాన్ని కిలో రూ.66 ఆర్‌ఎన్‌ఆర్, తెలంగాణ సోన రూ.74, హెచ్‌ఎంటీ, జేఎస్ రకం కిలో రూ. 79కు మాత్రమే విక్రయించాలని ఆదేశించారు. అధిక లాభాల కోసం వ్యాపారులు కుమ్మకై బియ్యం సరఫరా నిలిపివేయడం, ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా దారి మళించడం, కృత్రిమ కొరత సృష్టించడం, తప్పుడు బిల్లులు లేదా రికార్డులతో అక్రమ వ్యాపారం నిర్వహించడం వంటి వాటికి పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
● దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అందించిన సేవలు చిరస్మరణీయమని అదనపు కలెక్టర్లు మధుమోహన్, నర్సింగ్‌రావు అన్నారు. అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఐడీఓసీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విద్యారంగం అభివృద్ధికి ఆయన చేసిన విశేష కృషిని కొనియాడారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమశాఖ అధికారి సయ్యద్ అక్బర్ పాషా తదితరులు పాల్గొన్నారు.


