కరువును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు
● వీబీ–జీ రామ్‌జీ పథకంతో ప్రతి కూలీకి ఉపాధి కల్పించేలా ప్రణాళిక
● మూడు రకాల పనులకు ప్రాధాన్యం
గద్వాల న్యూటౌన్: జిల్లాలో కరువు మేఘాలు కమ్ముకున్నాయి. ఎల్‌నినో కారణంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో వానాకాలం పంటలు చాలా వరకు దెబ్బతినగా.. యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అన్ని మండలాలు కరువు మండలాల జాబితాలో చేరాయి. ప్రస్తుతం చేయడానికి పనులు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రతి కూలీకి పని కల్పించి.. ఆర్థికంగా చేయూత అందించాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే వీబీ–జీ రామ్ జీ కింద ఆరు నెలలపాటు కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలని సంకల్పించింది.
వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం..
ఈసారి వానాకాలంలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. తద్వారా భూగర్భజలాలు అడుగంటాయి. జలాశయాలు వెలవెలబోతున్నాయి. ఫలితంగా యాసంగి క్రాప్ హాలిడేగా ఇప్పటికే రైతులు నిర్ధారించుకున్నారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై కూడా ఎల్‌నినో తీవ్ర ప్రభావం చూపింది. వచ్చే జూన్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇక్కట్లు పడే పరిస్థితి ఏర్పడనుంది.
ప్రతి గ్రామం నుంచి 100మంది..
ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి సరాసరి 44 మంది కూలీలు పనులకు వస్తున్నారు. అయితే ప్రతి గ్రామం నుంచి 100 మంది కూలీలు పనులకు వచ్చేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు పనులను గుర్తించడంతో పాటు వెంటనే ప్రతిపాదనలు రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నారు. వచ్చే జూన్ వరకు కూలీలకు పనులు కల్పించి.. వలసలను నివారించడంతో పాటు ఆర్థికంగా చేయూత అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది.
యాసంగిలో వ్యవసాయ పనులు ఉండే అవకాశం లేదు. దీనికి తోడు వ్యవసాయేతర పనులు కూడా అంతంత మాత్రంగానే ఉండే పరిస్థితులు ఉన్నాయి. దీంతో కూలీలకు పనులు దొరక్క అవస్థలు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వీబీ–జీ రామ్‌జీ కింద కూలీలకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలని ఇటీవల జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వచ్చే జూన్ వరకు జాబ్‌కార్డు కలిగిన ప్రతి కూలీకి పని కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు వీబీ–జీ రామ్‌జీ పథకం కింద ప్రధానంగా నీటి సంరక్షణ పనులు, ఇరిగేషన్, వ్యవసాయ పొలాలకు సంబంధించిన మూడు రకాల పనులు పెద్ద ఎత్తున చేపట్టాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. డీఆర్డీఓ, ఇరిగేషన్, వ్యవసాయశాఖల అధికారులు, సిబ్బందితో కలెక్టర్ సమీక్షించి.. దిశానిర్దేశం చేశారు. మూడు శాఖలు సమన్వయంతో పనిచేస్తూ.. ప్రతి కూలీకి పని కల్పించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నీటి సంరక్షణ పనులైన ఇంకుడు గుంతలు, పాంపాండ్స్ (నీటి కుంటలు), పెర్కోలేషన్ ట్యాంక్స్, బోర్‌వెల్ రీచార్జి, ఓపెన్ వెల్స్, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రూప్ టాప్ హర్వెస్టింగ్ స్ట్రక్చర్స్ పనులతో పాటు చెరువులు, సాగుకాల్వల్లో పూడికతీత, జమ్ము తొలగింపు తదితర పనులు చేపట్టనున్నారు. వ్యవసాయానికి సంబంధించి పొలం బాటలు, భూమి చదును తదితర పనులు చేయనున్నారు.
మూడు రకాల పనులతో ప్రణాళిక..
అందరికీ పని కల్పిస్తాం..
కరువు పరిస్థితుల నేపథ్యంలో వీబీ–జీ రామ్ జీ కింద నీటి సంరక్షణ, ఇరిగేషన్, వ్యవసాయ పనులు పెద్ద ఎత్తున కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఈ మేరకు జాబ్‌కార్డు కలిగిన ప్రతి కూలీకి పని కల్పించేలా ప్రణాళిక రూపొందించాం. అన్ని గ్రామాల్లో పనులను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ.. ఎలాంటి ఆటంకం కలుగకుండా అన్ని చర్యలు తీసుకునేలా సిబ్బందికి దిశానిర్దేశం చేశాం.
– ముషాహిదాబేగం, డీఆర్డీఓ


