గద్వాలన్యూటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆదివారం నిర్వహించిన నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష ప్రశాంతంగా జరిగింది. పరీక్ష నిర్వహణకు జిల్లా కేంద్రంలో నాలుగు కేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రభుత్వ బాలుర ఉన్నత, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ అభ్యసన ఉన్నత, బ్రిలియంట్ పాఠశాలల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన పరీక్షకు వివిధ మండలాల నుంచి ఉపాధ్యాయులు విద్యార్థులను కేంద్రాలకు తీసుకొచ్చారు. మొత్తం 954 మంది విద్యార్థులకు గాను 924 మంది హాజరయ్యారు. 51 మంది ఇన్విజిలేటర్లు, నలుగురు చీఫ్ సూపరింటెండెంట్లు, నలుగురు డిపార్ట్‌మెంట్ అధికారులు పర్యవేక్షించారు. ఆయా కేంద్రాలను పరీక్షల నిర్వహణ విభాగం అధికారి శ్రీనివాసులు తనిఖీ చేశారు. కాగా, ఈ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ పూర్తయ్యే వరకు ఏటా రూ. 12వేల చొప్పున స్కాలర్‌షిప్ అందనుంది.


