పెట్టుబడుల పేరుతో కుచ్చుటోపీ | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడుల పేరుతో కుచ్చుటోపీ

Nov 2 2026 12:23 AM | Updated on Nov 2 2026 12:23 AM

● నడిగడ్డలో మితిమీరుతున్న మోసాలు

● ప్రజల అమాయకత్వం,

అత్యాశను పెట్టుబడిగా

మార్చుకుంటున్న కేటుగాళ్లు

● తాజాగా రూ. 3కోట్లు కాజేసిన వైనం

● మోసపోయిన వారిలో యువకులే అధికం

గద్వాల క్రైం: ‘‘ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పలు కంపెనీలు విపరీతమైన లాభాలు ఇస్తు్‌ాన్నయి.. మీరు రూ.లక్ష పెట్టుబడి పెడితే రెండింతల లాభం పొందవచ్చు.. ఇదిగో నా స్నేహితులు రూ.లక్షలు సంపాదించారు.. కావాలంటే చూడు..’’ అంటూ నడిగడ్డలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల అమాయకత్వం, అత్యాశను పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు తనకు తెలిసిన వారిని నమ్మించి నట్టేట ముంచాడు. మోసపోయిన బాధితులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించారు. జిల్లాలో ఇలాంటి ఘటనలు తరచుగా చోటు చేసుకుంటుండటం అందరినీ ఆందోళన కలిగిస్తోంది.

మచ్చుకు కొన్ని..

● జిల్లా కేంద్రానికి ఓ యువకుడు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌లో నైపుణ్యం పొందాడు. తనకు తెలిసిన స్నేహితులతో ముందుగా ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌లోని పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించాడు. కొన్ని రోజుల వ్యవధిలోనే స్నేహితులకు రెట్టింపు ఆదాయం చేమకూరింది. దీంతో మరికొందరిని నమ్మించి ఆన్‌లైన్‌ ట్రెడింగ్‌ ద్వారా రూ. 3కోట్ల మేర పెట్టుబడులు పెట్టించాడు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లాడు. బాధితులు పలుమార్లు వాకబు చేయగా.. నేడు, రేపు అంటూ చెప్పడంతో చివరకు తాము మోసపోయినట్లు గుర్తించి, గతనెల 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు.

● శ్రీజోగుళాంబ చిట్‌ఫండ్‌ పేరుతో గద్వాలకు చెందిన టీడీపీ నాయకుడు తన చిట్‌ఫండ్‌ సంస్థలో పెట్టుబడులు పెడితే మంచి వడ్డీ అందజేస్తామని అందరినీ నమ్మించాడు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన వారితో సుమారు రూ. 4.25 కోట్లు వసూలు చేశాడు. కొన్ని రోజుల తర్వాత తీసుకున్న డబ్బులు చెల్లించేందుకు అయిష్టత చూపాడు. అయితే పెట్టుబడులు పెట్టిన బాధితులు గట్టిగా ప్రశ్నించడంతో గుట్టుగా బోర్డు తిప్పేశాడు. మోసపోయిన బాధితులు గత ఆగస్టులో మహబూబ్‌నగర్‌ టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

● గతేడాది గద్వాల మండలానికి చెందిన పలువురిని ఓ ఏజెంట్‌ స్టాక్‌ మార్కెట్‌లో డబ్బులు పెడితే మంచి లాభాలు వస్తాయని నమ్మించాడు. ఇది నమ్మిన వారు ఏంజెల్‌ వన్‌ లిమిటెడ్‌ కంపెనీలో రూ. 5కోట్ల పెట్టుబడులు పెట్టారు. చివరకు సదరు ఏజెంట్‌ మృతి చెందడంతో బాధితులు అతడి కుటుంబ సభ్యులకు పెట్టుబడుల విషయాన్ని వివరించారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు తమకేం సబంధం లేదని చెప్పడంతో న్యాయం కోసం రూరల్‌ పోలీసులను ఆశ్రయించారు.

యువతే టార్గెట్‌..

ఆన్‌లైన్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారంతా యువకులే ఉండటం గమనార్హం. తాజాగా మోసపోయిన వారిలో దాదాపు 70మందికి పైగా ఉంటారు. ఒక్కొక్కరు రూ. 5లక్షల నుంచి రూ. 25లక్షల వరకు పెట్టుబడుల రూపంలో సదరు యువకుడికి అందజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు ఎలాగైనా న్యాయం అందేలా చూడాలని వేడుకుంటున్నారు. ఇంట్లో తెలియకుండా బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టామని చెబుతున్నారు. తమ పేర్లు బయటకు వస్తే సమాజంలో సమస్యలు పడుతామని ‘సాక్షి’తో వివరించారు. అయితే జిల్లాకు చెందిన ఏడుగురు దాదాపు రూ. 55లక్షలు మోసపోయారు. సదరు యువకుడు మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌కు చెందిన వారితో సైతం పెట్టుబడులు పెట్టించారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement