గద్వాల న్యూటౌన్: వానాకాలం సీజన్‌లో పండించిన వరి పంట వచ్చేనెలలో చేతికి రానుంది. ఈ క్రమంలో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు అవసరమైన కసరత్తును అధికారులు కొద్దిరోజుల క్రితమే ఆరంభించారు. ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో 88 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా.. ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ ఇప్పటికే కేంద్రాల నిర్వహణ, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెలాఖరున కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి దిగుబడులు గణనీయంగా తగ్గనున్నాయి.
తగ్గనున్న దిగుబడులు..
నడిగడ్డలో ఏటా వానాకాలం సీజన్‌లో పత్తి తర్వాత ఎక్కువగా వరిని సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవవన్న ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ బోర్లు, బావుల కింద, ఆయకట్టు రైతులు జూలైలో వరినారు మడులు పోసుకున్నారు. ఇదే సమయంలో ఎగువన కురిసిన వర్షాలతో జూరాల జలాశయం జలకళ సంతరించుకుంది. దీంతో అధికారులు నెట్టెంపాడు ఎత్తిపోతల కింద ఉన్న రిజర్వాయర్లు, జూరాల కాల్వల ద్వారా ఆయకట్టుకు నీటిని వదిలారు. రైతులు పంటను వేశారు. అయితే ఆగస్టు రెండో వారం నాటికి పరిస్థితి మారిపోయింది. వర్షాలు లేక పంట ఎదుగుదల లోపించింది. భూగర్భజలాలు అడుగంటాయి. ఇదే సమయంలో అప్రకటిత విద్యుత్ కోతలు మొదలయ్యాయి. దీంతో బోర్లు, బావుల కింద సైతం పంటకు నీళ్లు అందించలేకపోయారు. సెప్టెంబర్ మొదటి వారం నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయి.. ఆయకట్టు నుంచి నీటి విడుదల ఆగిపోయింది. రైతుల ఆందోళనలతో వారబందీ పద్ధతిన మళ్లీ వదిలినప్పటికీ వరి పంటపై తీవ్ర ప్రభావం పడింది. నల్ల కంకి, పొడవిరుపు తెగుళ్లు పంటకు విపరీతంగా ఆశించాయి. ఫలితంగా వరి దిగుబుడులు తగ్గనున్నాయి. ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్లు రావాల్సి ఉండగా.. 18 నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే వచ్చే పరిస్థితి నెలకొంది. మొత్తంగా జిల్లాలో 1.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫీజుకు ఎగనామం!
ప్రభుత్వానికి చెల్లించాల్సిన మార్కెట్ ఫీజును ఎగవేస్తూ కొందరు వ్యాపారులు యథేచ్ఛగా జీరో దందా సాగిస్తున్నారు.
–8లో u
కోతలు ప్రారంభం..
జిల్లాలో వరి పంటను కొన్ని ప్రాంతాల్లో జూన్ మొదటివారం, ఇంకొన్ని చోట్ల జూలై మొదటి, చివరి వారాల్లో వేశారు. వచ్చే నెల మొదటి, రెండో వారం కొంత, చివరి వారం నుంచి చాలాచోట్ల పంట కోతలు ప్రారంభం కానున్నాయి. ఆర్‌ఎన్‌ఆర్, బీపీటీ, కేఎన్‌ఎం 1638, తెలంగాణ సోన తదితర ఏడు సన్న రకాలను మాత్రమే వేయాలని, వీటినే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది మద్దతు ధర ఏ గ్రేడ్ రకానికి క్వింటాకు రూ.2,461 ఉంది. దీనికితోడు రూ.500 బోనస్ ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ, పీఏసీఎస్‌లు, పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కేంద్రాల్లో అన్ని వసతులు ఏర్పాటు చేసి, ఈ నెలాఖరున ప్రారంభించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా కోతలు పూర్తయిన వెంటనే కొనుగోళ్లు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కేంద్రాల సిబ్బందికి శిక్షణ పూర్తి చేసి, తేమ మిషన్, ఇతర సామగ్రి, రికార్డులు అందించారు.
మొదటి వారంలో ప్రారంభం కానున్న వరిధాన్యం సేకరణ
ఇప్పటికే సిబ్బందికి శిక్షణ, మిషన్ల అప్పగింత
కేంద్రాల నిర్వహణపై కలెక్టర్‌పై దిశానిర్దేశం
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలకు ఆదేశం
జిల్లాలో నెల మధ్యలో మొదలుకానున్న వరికోతలు


