ఇటిక్యాల: మండలంలోని చాగాపురంలో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ వెస్లీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నుంచి గురువారం సెంట్రల్ టీమ్ గ్రామాన్ని సందర్శించనున్న నేపథ్యంలో ఉత్తమ గ్రామ పంచాయతీ ఎంపిక కావడానికి నిర్ధేశించిన అర్హతలు, ప్రమాణాలకు అనుగుణంగా గ్రామంలో చేపట్టిన పనులు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు తదితర అంశాల గురించి ఆరా తీశారు. కేంద్ర బృందం పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని సంబంధించిన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, డీపీఓ శ్రీకాంత్, డీఎల్‌పీఓ ప్రవీణ్, సర్పంచ్ సావిత్రమ్మ, ఎంపీడీఓ రమాదేవి, ఎంపీఓ సునీల్, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిబంధనలు
ఉల్లంఘిస్తే చర్యలు
అయిజ: ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని భూంపురం, ఉత్తనూరు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలను డీఈఓ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రైవేటు పాఠశాలలు ఇరుకై న గదులు, గాలి, వెలుతురు సరిగా లేకపోవడం, తగిన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం, ఇసుకలో విద్యార్థులను కూర్చోబెట్టి చదువు చెప్పడం, ఆటస్థలం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని యాజమాన్యంపై మండిపడ్డారు. ఇకపై నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అతిక్రమిస్తే పాఠశాలల అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు.


