గద్వాల: ఎల్‌నినో ప్రభావం గ్రామీణ ప్రాంతాలపై పడకుండా వీబీజీ రాంజీ పనులు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నిర్వహించిన వీసీలో ఆయన పాల్గొని అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించి ఆర్థికంగా అండగా నిలుస్తూ నీటి భద్రతను పెంపొందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా చెరువుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పనులు చేపట్టి నీటినిల్వ సామర్థ్యాన్ని పెంపొందించాలన్నారు. పశుగ్రాసం సాగుకు ఎకరాకు రూ.14 వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు. జలసిరిలో భాగంగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు, ఊరికి ఊటకుంటలు, ప్రతిపంటకు నీటికుంటలు నిర్మించి వర్షపు నీటిని నిల్వచేసి భూగర్భ జలాలను పెంచే చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ, గ్రామీణ ఆర్గనైజేషన్ భవనాల పనులు వేగవంతం చేయాలన్నారు. పనులన్నీంటిని నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో గ్రామీణ అభివృద్ధి అధికారి ముషాయిదాబేగం, డీపీఓ శ్రీకాంత్, డీఏఓ వీరప్ప, ఈఈ ప్రభాకర్, శ్రీధర్‌రెడ్డి, పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


