అలంపూర్: బాలల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి, న్యాయ సేవల కమిటీ చైర్మన్ ఆర్వీఎస్ఎస్ మిథున్తేజ అన్నారు. పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో మండల న్యాయ సేవల కమిటీ అధ్వర్యంలో సురక్షిత్ బచ్పన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బాలల చట్టాలు, హక్కులపై బుధవారం అవగాహన కల్పించారు. ఈ సదస్సుకు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్ తేజ, పాఠశాల డైరెక్టర్ కేఎన్వీ రవిప్రకాష్ హాజరై జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సదస్సులో విద్యార్థులకు బాలల హక్కులు, భద్రత, లైంగిక వేధింపు నేరాల రక్షణ చట్టం–2012(పోక్సోచట్టం) గురించి వివరించారు. అనంతరం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మాట్లాడుతూ.. బాలలు తమ హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి నరసింహ, ఏజీపీ మధు, ఎస్ఐ రామకృష్ణ, లోక్అదాలత్ ఇన్చార్జీలు సాయితేజ, జహంగీర్, పరశురాం తదితరులు ఉన్నారు.


