గట్టు: ఎట్టకేలకు జిల్లా అధికార యంత్రాంగం కదిలారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం గురువారం ఇందువాసి గ్రామంలోని వలస కూలీల కుటుంబాలను కలిసి వివరాలు సేకరించారు. జిల్లా మాతా, శిశు, సంక్షేమ అధికారి సునంద, జిల్లా పౌరసరఫరాల శాఖ డీఎం విమలాదేవి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అక్బర్, తహసీల్దార్ విజయ్‌కుమార్, వైద్యాధికారి రమేష్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ ప్రశాంత్‌గౌడ్, ఆర్ఐ షేక్షావలి, జీపీఓ భాస్కర్ ఇందువాసి గ్రామంలో వలస కూలీలను పరామర్శించారు. కర్ణాటక రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలతోపాటు గాయపడ్డ వారి కుటుంబాల నుంచి వారు వివరాలు సేకరించారు. ఇందువాసి గ్రామానికి చెందిన సుమారు 40 దళిత కుటుంబాలు కర్ణాటకలోని యాదగిరి ప్రాంతానికి వలస వెళ్లారు. ఈ నెల 10న కూలీ పనులకు వెళ్తున్న వీరి ట్రాక్టర్‌ను టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు కూలీలు మృతిచెందగా.. 32 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఇందువాసి గ్రామానికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. అయితే సంఘటన జరిగి 6 రోజులు గడిచినా అధికార యంత్రాంగం బాధిత కుటుంబాలను పరామర్శించకపోవడం అన్యాయమని ఆరోపించారు. ఈ క్రమంలోనే గురువారం అధికార యంత్రాంగం ప్రభుత్వ పరంగా మృతుల కుటుంబాలకు అందించాల్సిన ఆర్థిక సహాయం, గాయపడ్డ వారి వివరాలు సేకరించారు. గాయపడ్డ వారు ఎక్కడి చికిత్స తీసుకున్నారు.. ఇంకా ఏమైనా వైద్య సహాయం అవసరమా అనే విషయాలపై ఆరా తీశారు. తల్లిదండ్రులు లేని పిల్లలు, నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఉంటే వారిని వసతి గృహంలో చేర్పించే విషయం గురించి చర్చించారు. ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం, సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
వలస కూలీల కుటుంబాలను పరామర్శించిన అధికారులు


