శుక్రవారం శ్రీ 16 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
పూలు విరిసే.. పుడమి మెరిసే
తీరొక్క పూలతో చూడముచ్చటైన బతుకమ్మలు.. జానపద గేయాల హోరుకు అనుగుణంగా అడుగుల సవ్వడి తోడై బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించే పూల పండుగ బతుకమ్మ వేడుకలను గురువారం సాయంత్రం కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా మహిళా ఉద్యోగులు, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో తేరు మైదానంలో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మహిళా ఉద్యోగులు, యువతులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని.. చిత్తూ చిత్తూల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మా.. అంటూ బతుకమ్మ ఆడారు. కలెక్టరేట్లో ఆకట్టుకునేలా రూపుదిద్దుకున్న బతుకమ్మలకు, గౌరీమాతకు అదనపు కలెక్టర్ నర్సింగరావు పూజలు చేశారు. తేరు మైదానంలో కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్, అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి, సతీమణి జ్యోతి, మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఉత్సాహపరిచారు. – గద్వాల న్యూటౌన్


