● మృతుడి సూసైడ్ నోట్‌లో ఆరోపణలు.. పోలీసుశాఖలో కలకలం
● భార్య ఫిర్యాదుతో కేసు.. సఖి సెంటర్‌లో కౌన్సెలింగ్
● మనస్తాపంతో ఈ నెల 5న బూరెడ్డిపల్లి గ్రామవాసి
నరేశ్‌చారి ఆత్మహత్యయత్నం.. చికిత్స పొందుతూ మృతి
గద్వాల క్రైం: భార్యతో వివాదాలు, పోలీసుల వ్యవహార తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన మృతికి భార్య కుటుంబసభ్యులతో పాటు కొందరు పోలీసులు కారణమంటూ అతడు రాసినట్లు చెబుతున్న లేఖ వెలుగులోకి రావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. అయితే మృతుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పోలీసులు చెబుతున్నారు. ఆరోపణలపై విచారణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే.. ధరూరు మండలం బూరెడ్డిపల్లికి చెందిన వడ్ల నరేశ్‌చారి (34) కేటీదొడ్డి మండలానికి చెందిన రాణిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. కొంతకాలం హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేసిన దంపతులు అనంతరం గద్వాలలోని రెండో రైల్వేగేట్ సమీపంలో అద్దెకు ఉంటున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో సుమారు రెండు నెలల క్రితం నరేశ్‌చారి ప్రవర్తనపై రాణి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి సఖీ సెంటర్‌లో కౌన్సెలింగ్ ఇచ్చారు.
పోలీసులపై ఆరోపణలు
ఈ క్రమంలో తన భార్యకు ఓ ఏఆర్ కానిస్టేబుల్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నరేశ్‌చారి ఆరోపించినట్లు సమాచారం. తనపై తప్పుడు కేసు నమోదుకు కానిస్టేబుల్‌తో పాటు తన తల్లి, భార్య తమ్ముడు కారణమని పేర్కొంటూ గత జూన్ 25న ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పట్టణ ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్, ఏఆర్ కానిస్టేబుల్ బాలు, అత్త సరిత, కిట్టుపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. భార్య తిరిగి తనతో కాపురానికి రావాలని నరేశ్‌చారి కోరినప్పటికీ ఆమె అందుకు అంగీకరించలేదని సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఈ నెల 5న శంషాబాద్ ప్రాంతంలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించగా.. పది రోజుల పాటు చికిత్స పొందుతూ సోమవా రం మృతి చెందాడు.
సూసైడ్ నోట్‌లో ప్రస్తావన
తన మృతికి భార్య కుటుంబ సభ్యులు, కొందరు పోలీసులు కారణమంటూ నరేశ్‌చారి లేఖ రాసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తనకు న్యాయం జరగలేదని, తన మృతితోనైనా న్యాయం జరుగుతుందని అందులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం పోలీసుశాఖలో చర్చనీయాంశంగా మారింది.
మృతదేహం తరలింపులో హైడ్రామా
నరేశ్‌చారి మృతదేహాన్ని సోమవారం రాత్రి గద్వాలలోని ఆయన అద్దె ఇంటి వద్దకు తీసుకురాగా.. ఇంటి యజమాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మృతదేహాన్ని భార్య ఉంటున్న ప్రాంతానికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. విషయం పోలీసులకు తెలియడంతో ఎస్‌ఐ కుటుంబసభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలని సూచించిన క్రమంలో కొంత గందరగోళం చోటుచేసుకుంది. చివరకు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగా.. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు.
విచారణ కొనసాగుతోంది..
నరేశ్‌చారిపై భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇచ్చామని ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్ తెలిపారు. ఇందులో ఎలాంటి తప్పిదం లేదన్నారు. కానిస్టేబుల్‌పై చేసిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఆత్మహత్యకు పోలీసులను కారణంగా పేర్కొనడం సరైనది కాదని, మృతుడు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఏఆర్ కానిస్టేబుల్ మాట్లాడుతూ.. నరసింహాచారి ఎవరో తనకు తెలియదని, తనపై ఏదైనా ఆరోపణ ఉంటే న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు.


