సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రాష్ట్ర కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం రేపిన ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఎపిసోడ్‌పై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. పార్టీ అధిష్టాన నిర్ణయం మేరకు ఆయనపై వేటు పడింది. ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని తప్పిస్తూ.. ఆయన స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రకటన సైతం వెలువడింది. గాంధీ కుటుంబానికి విధేయుడిగా, కరుడుగట్టిన కాంగ్రెస్ వాదిగా పేరున్న సీనియర్ నేతపై ఊహించని చర్యలు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కలకలం సృష్టిస్తుండగా.. ఆయన దారెటు అనేది హాట్‌టాపిక్‌గా మారింది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం..
చిన్నారెడ్డి 1980 నుంచి 1983 వరకు ఏపీ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1985లో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ 1989 ఎన్నికల్లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999–2004, 2004–2009, 2014–2018 కాలంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో 2007 నుంచి 2009 వరకు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా సేవలందించారు. 2018లో వనపర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2021లో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
టికెట్ చేజారడం నుంచి మొదలు..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చిన్నారెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం మొదట ప్రకటించింది. ఆ తర్వాత బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మేఘారెడ్డికి టికెట్ కేటాయించడంతో చిన్నారెడ్డి పోటీ నుంచి విరమించుకున్నాడు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మేఘారెడ్డి గెలుపొందగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2024లో చిన్నారెడ్డికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. అయితే టికెట్ వచ్చినట్లే వచ్చి చేజారడంతో మనస్థాపానికి గురైన ఆయన పలుమార్లు అసహనం వ్యక్తం చేస్తూ వచ్చారు.
అనివార్యత పరిస్థితుల్లోనేనా..
సీఎం రేవంత్‌రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితాపటేల్ చేసిన వ్యాఖ్యలు.. ఆ తర్వాత కొండా సురేఖ సైతం విమర్శలు గుప్పించడం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌లో తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమైపె వేటు వేసే క్రమంలో చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన అనివార్యత ఏర్పడిందని కాంగ్రెస్‌తో పాటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
చిన్నారెడ్డి వర్గీయుల్లో అయోమయం
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి చిన్నారెడ్డిని తప్పించిన క్రమంలో ఆయన అనుచర వర్గంలో నిరాశ అలుముకుంది. ఆయన మాట్లాడింది పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు కావని, దశాబ్దాలుగా జెండా మోసిన పాత కార్యకర్తల ఆవేదననే వెళ్లగక్కా రని వారు చెబుతున్నారు. 48ఏళ్ల క్రమశిక్షణకు పార్టీ ఇచ్చిన బహుమతి ఇదేనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల క్రమంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. తమ భవిష్యత్ ఎలా ఉంటుందోననే ఆందోళన, అయోమయం వారిలో నెలకొన్నట్లు తెలుస్తోంది.
గోపాల్‌పేట మండలం జయన్నతిరుమలాపూర్‌లోనితన వ్యవసాయ క్షేత్రంలో చిన్నారెడ్డి
ముదిరిన విభేదాలు..
వనపర్తి నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల క్రమంలో మేఘారెడ్డి, చిన్నారెడ్డి మధ్య దూరం పెరుగుతూనే వచ్చింది. అటు ప్రభుత్వ, ఇటు పార్టీ పరంగా తనకు ప్రాధాన్యం దక్కడం లేదని పలుమార్లు చిన్నారెడ్డి అసంతృప్తి వెళ్లగక్కారు. కేబినెట్ హోదాలో తనకు కేటాయించిన గన్‌మెన్లు, ప్రభుత్వ వాహనాన్ని ఉపసంహరించుకున్నారు. తన అనుచరులను ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. మేఘారెడ్డి సైతం ఆయనపై ప్రతి విమర్శలు చేయడం.. ఇలా ఇద్దరి మధ్య క్రమక్రమంగా విభేదాలు మరింత ముదిరాయి.
ఘాటు విమర్శలతో..
ఇటీవల గోపాల్‌పేటలో పార్టీ కార్యాలయ ప్రారంభం సందర్భంగా చిన్నారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలో చాలా తప్పులు జరుగుతున్నాయని, వాటిని భరిస్తూ వస్తున్నానని, లేకుంటే తాను మరో జీవన్‌రెడ్డిని అయ్యేవాడినని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ తనకు సీటు ఇచ్చినా ఇక్కడ డబ్బులకు లొంగి తనకు సీటు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో అన్ని అనుభవించిన వారు ఇప్పుడు పార్టీలోకి వచ్చి మళ్లీ తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 48 ఏళ్లు కాంగ్రెస్ కోసం కష్టపడి పనిచేశానన్నారు. ఈ వ్యాఖ్యలు నియోజవర్గంలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా చిన్నారెడ్డి తొలగింపు
సీనియర్ నేతపై కాంగ్రెస్ అధిష్టానం ఊహించని చర్యలు
ఉమ్మడి పాలమూరువ్యాప్తంగాహస్తం శ్రేణుల్లో కలకలం
భవిష్యత్‌పై జిల్లెల అనుచరుల్లో అయోమయం


