ధరూరు: జిల్లాలో పంట నమోదు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప అన్నారు. గురువారం మండలంలోని ఎములోనిపల్లి గ్రామ శివారులో వ్యవసాయ శాఖ అధికారులు నిర్వహిస్తున్న పంట నమోదు సర్వేను ఆయన పరిశీలించి.. మాట్లాడారు. పంట నమోదు కార్యక్రమాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. వరి పంట సాగు చేసిన రైతులు ఎక్కడైతే విత్తనాలు కొనుగోలు చేశారో వారి దగ్గరే నమోదు చేయించాలని చెప్పారు. ముఖ్యంగా ఆర్‌ఎన్‌ఆర్15048, బీపీటీ 5204, జైశ్రీరాం హెచ్‌ఎంటీ సోనా, కేఎన్‌ఎం 1638, కేఎన్‌ఎం 715, డబ్ల్యూజీఎల్ 44 వంటి ఏడు రకాల వరి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. సొంత విత్తనాలు వేసుకున్న రైతులు ఎవరైనా ఉంటే అలాంటి వారు ఏఈఓ దగ్గర డిక్లరేషన్ ఫాం నమోదు చేయించుకోవాలన్నారు. వరి విత్తనాలు కొనుగోలు చేయని రైతులకు ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్ రాదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఏఓ శ్రీలత, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
నేత్రదాన పక్షోత్సవాలు
గద్వాల క్రైం: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గురువారం 41వ నేత్రదాన పక్షోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి వైద్యాధికారి సంధ్యా కిరణ్మయి మాట్లాడుతూ మరణించిన తర్వాత కళ్లను మరొకరికి దానం చేయడం ద్వారా వారికి చూపును అందిస్తామన్నారు. ప్రతి ఒక్కరు తమ మరణానంతరం నేత్రదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. నేత్రదాన పక్షోత్సవాలను ఈ నెల 8 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహిస్తూ.. కళ్ల ప్రాముఖ్యతను ప్రజలకు వివరించి చైతన్యం తీసుకువచ్చేందుకు కృషిచేస్తున్నామన్నారు.
నర్సరీల నిర్వహణకు పక్కాగా రిజిస్ట్రేషన్
గద్వాల వ్యవసాయం: ఉద్యాన నర్సరీలను రిజిస్ట్రేషన్ చేయించి.. లైసెన్స్ తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉద్యాన శాఖాధికారి రాజ్‌కుమార్ అన్నారు. గురువారం గద్వాల శివారులోని పలు కూరగాయల నర్సరీలను ఆయన సందర్శించి.. మొక్కల నాణ్యత, నర్సరీల నిర్వహణ, రిజిస్ట్రేషన్, లైసెన్స్ తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిబంధనలు పాటించకుండా నర్సరీలు నిర్వహిస్తే నర్సరీల రిజిస్ట్రేషన్, క్రమబద్ధీకరణ చట్టం–2010, తెలంగాణ ఉద్యాన నర్సరీల రిజిస్ట్రేషన్– 2017 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసు కుంటామన్నారు. కొన్ని నర్సరీలు ప్రభుత్వ అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా నాసిరకం నారు, మొక్కలను విక్రయిస్తూ.. రైతులకు బిల్లులు ఇవ్వడం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. రైతులకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన, చీడపీడలు లేని కూరగాయల నారు, పండ్లు, పూల మొక్కలను అందించడమే నర్సరీ చట్టం ప్రధాన ఉద్దేశం అన్నారు. మొక్కల నాణ్యత, పరిమాణం, ప్రమాణాలకు అనుగుణంగా ధర ఉండాలన్నారు. ఆయన వెంట ఉద్యాన అధికారి రాజశేఖర్ తదితరులున్నారు.


