నారాయణపేట/కోస్గి/కొత్తపల్లి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం మద్దూర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని నారాయణపేట కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. గురువారం మద్దూరు పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన ఏఎస్‌ఎల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. హెలిప్యాడ్ నుంచి సీఎం పర్యటించే మార్గంలో రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్యం, అగ్నిమాపక, బ్యారికేడింగ్ ఏర్పాట్లు పూర్తిచేయాలని సూచించారు. సీఎం రూట్‌లో రహదారి మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని, జనసందోహం, ట్రాఫిక్ నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. అత్యవసర వైద్య సేవలు, తాగునీరు, ఆహార ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
సీఎం వాహనం వద్దకు ఎవరూ రాకూడదు
సీఎం వాహనం సమీపానికి ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు రాకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశించారు. యాక్సెస్ కంట్రోల్, ట్రాఫిక్ నియంత్రణను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. అంతకుముందు నారాయణపేట కలెక్టర్, ఎస్పీ మద్దూర్ సమీపంలోని హెలీప్యాడ్, డిగ్రీ కళాశాల, గురుకుల బాలికల పాఠశాల/కళాశాల భవన నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు.


