ఎర్రవల్లి: మండలంలోని బీచుపల్లి పుణ్యక్షేత్రాన్ని శుక్రవారం జిల్లా ప్రిన్సిపల్ జడ్జి కళ్యాణచక్రవర్తి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అభయాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ సిబ్బంది ఆయనకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికి శేషవస్త్రాలతో సత్కరించారు. అనంతరం ఆలయ అర్చకులు మారుతిచారి తీర్థ ప్రసాదాలను అందించి ఆలయ చరిత్ర గురించి వివరించారు.
విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయం
గద్వాల న్యూటౌన్: ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూ కేవలం ఉపాధ్యాయుల సమస్యలపైనే కాకుండా, విద్యాభివృద్ధికి పాటుపడటం అభినందనీయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఎస్టీయూ ఏర్పడి 80 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంఘం నాయకులతో కలిసి వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్, కాళోజీ నారాయణరావు, మగ్దూం మొయినుద్దీన్, రాఘవచారి, శ్యాంసుందర్‌రావు లాంటి మహానుభావులు ఎస్టీయూలో పనిచేశారన్నారు. ఈ నెల 27న హైదరాబాద్‌లోని నాగోల్‌లో జరిగే ఎస్టీయూ 80వ వసంత వేడుకలు ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పులిపాటి లక్ష్మణ్, ప్రధానకార్యదర్శి యూనుస్‌పాషా, అసోసియేట్ అధ్యక్షుడు కృష్ణయ్య, రాష్ట్రకౌన్సిల్ సభ్యుడు శంకర్‌నాయక్, నాయకులు విజయ్‌భాస్కర్, చెన్నకేశవులు, వెంకటేష్, జయరాజు, శ్రీహరి, కిషోర్ చంద్ర, గౌరి శంకర్, భీమన్న, అయూబ్ తదితరులు పాల్గొన్నారు.


