సొంత ల్యాబ్.. విద్యార్థులకు ఉచిత ప్రయోగాలు!
● బడిని బోధనకు మాత్రమే పరిమితం చేయకుండా.. విజ్ఞానం, విలువలు నేర్పుతున్న టీచర్లు
● వినూత్న బోధనతో విద్యార్థుల జీవితాల్లో వెలుగులు
● రూ.12 లక్షలతో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుడు
తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువు జీవితానికి దిశానిర్దేశం చేస్తారు. పుస్తకంలోని అక్షరాలను పరిచయం చేయడమే కాదు.. ఆ అక్షరాల వెనుక ఉన్న ప్రపంచాన్ని విద్యార్థులకు చూపిస్తారు. చీకటిలో దారి తప్పినవారికి దీపంలా.. సందిగ్ధంలో ఉన్నవారికి దిక్సూచిలా నిలిచి, ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తారు. అందుకే గురువు తరగతి గదిలో కనిపించే ఓ వ్యక్తి మాత్రమే కాదు.. రేపటి సమాజాన్ని నిర్మించే శిల్పి. పదవీ విరమణ చేసినా బోధనకు దూరం కాకుండా బడిబాట పడుతున్నవారు కొందరైతే.. గణితం అంటే భయపడే విద్యార్థుల్లో ఆసక్తిని నింపుతున్న వారు మరికొందరు. గిరిజన తండాల పిల్లలను బడికి రప్పించి చదువుతో పాటు సేంద్రియ సాగు నేర్పుతున్నవారు.. చాక్లెట్‌కు బదులు మొక్కను అందించి ప్రకృతిపై ప్రేమను పెంచుతున్నవారు.. సొంత ఖర్చుతో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేసి ప్రయోగాల ప్రపంచాన్ని విద్యార్థుల ముందుకు తీసుకొస్తున్నవారు ఇంకొందరు. వారి చేతిలో ఉన్నది సుద్ద ముక్కే.. కానీ ఆ సుద్దతో రాసేది కేవలం పాఠం కాదు.. ఓ విద్యార్థి భవిష్యత్. వారి బోధనలో అక్షరాలే కాదు.. ఆలోచనలు ఉన్నాయి. వారి అడుగుల్లో ఉద్యోగ బాధ్యత కాదు.. రేపటి తరంపై బాధ్యత ఉంది. ఇలా వీరి ప్రతి అడుగు విద్యార్థుల భవిష్యత్ కోసమే. శనివారం (నేడు) జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యార్థి జీవితాల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న గురువులపై ప్రత్యేక కథనం..
– గద్వాల/మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్/రాజాపూర్
విద్యార్థులకు పాఠ్యపుస్తకాల్లోని సైన్స్ అంశాలను ప్రయోగాత్మకంగా నేర్పేందుకు జెడ్పీహెచ్‌ఎస్ నవాబ్‌పేట ఉపాధ్యాయుడు టీఎన్ శ్రీధర్ వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్‌లో సుమారు రూ.12 లక్షల సొంత ఖర్చుతో షెడ్డు నిర్మించి ఆధునిక సైన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ప్రయోగాలకు అవసరమైన పరికరాలు, సామగ్రిని సమకూర్చి ‘కలాం డ్రీం ఫోర్స్ ఫౌండేషన్’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా ప్రయోగాలు చేసే అవకాశం కల్పిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ ల్యాబ్‌ను వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసి.. తరగతుల వారీగా విద్యార్థులకు ప్రయోగాల కోసం రోజులు కేటాయిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 400 మంది విద్యార్థులు ఇక్కడ వివిధ సైన్స్ ప్రయోగాలు చేస్తున్నారు. పుస్తకాల్లో చదివిన అంశాలను స్వయంగా చేసి చూడటంతో వారిలో శాసీ్త్రయ ఆలోచనా విధానం, సైన్స్‌పై ఆసక్తి పెరుగుతోంది. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించేందుకు శ్రీధర్ చేస్తున్న కృషికి పలు రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులు లభించాయి. ఆయన సేవలను గుర్తించిన రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఇటీవల అభినందించారు.
పుట్టిన రోజంటే చాక్లెట్లు పంచుకోవడం సాధారణం. కానీ ఫతేపూర్ జెడ్పీహెచ్‌ఎస్‌లో మాత్రం అందుకు భిన్నంగా పుట్టినరోజున మొక్కను నాటడం సంప్రదాయంగా మారింది. పాఠ్యాంశాలతో పాటు ఆచరణాత్మక విద్యను అందిస్తూ పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయంపై విద్యార్థుల్లో అవగాహన పెంచుతున్న హెచ్‌ఎం కొల్లూరి వెంకటమ్మ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది. విద్యార్థులు తమ పేర్లతో పూలు, పండ్ల మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకుంటున్నారు. దీంతో పాఠశాల ఆవరణలో ఇప్పటికే 100కు పైగా మొక్కలు పెరుగుతున్నాయి. మరోవైపు ఆకుకూరలు, వివిధ రకాల కూరగాయలను విద్యార్థుల భాగస్వామ్యంతో సాగు చేస్తున్నారు. తోటలో పండిన కూరగాయలను పాఠశాల వంటకు వినియోగిస్తున్నారు. దీంతో పుస్తకాల్లో చదివే వ్యవసాయ పాఠాలను విద్యార్థులు కళ్లముందే ఆచరణలో నేర్చుకుంటున్నారు. ‘‘చదువుతో పాటు పర్యా వరణ పరిరక్షణ, మొ క్కల సంరక్షణ, వ్య వసాయం, పరిశుభ్రతను ఆచరణాత్మకంగా నేర్పు తూ బాధ్యతాయుత పౌరులు గా తీర్చి దిద్దుతున్నాం’’ అని హెచ్‌ఎం వెంకట మ్మ తెలిపారు.
ఉద్యోగ విరమణ తర్వాత విశ్రాంత జీవితం గడపాల్సిన వయసులోనూ ఓ రిటైర్డ్ ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధన చేస్తూ తన సేవలను కొనసాగిస్తున్నారు. 38 ఏళ్లపాటు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు మంగళగిరి నర్సోజి.. నేటికీ వారంలో రెండు రోజులు ఏదో ఒక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిస్తున్నారు. రాజాపూర్, బాలానగర్ మండలాల్లో పనిచేసిన నర్సోజి విద్యార్థుల్లో సైన్స్, గణితంపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. లోకాస్ట్, నోకాస్ట్ మెటీరియల్‌తో వివిధ ఉపకరణాలు తయారు చేసి చంద్రయాన్–3పై అవగాహన కల్పించారు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, దక్షిణ భారత సైన్స్ ఫెయిర్‌లలో వీటిని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, ఓజోన్ పొర ప్రాముఖ్యతపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించేందుకు తన సొంత ఖర్చులతో బహుమతులు, అభ్యసన సామగ్రి ని అందిస్తున్నారు. ఇటీవల సంగారెడ్డిలో జరిగిన 2026 సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో చంద్రయాన్–3 మోడల్‌ను ప్రదర్శించి ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.
బోధనతో విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ.. పరిశోధనతో కొత్త ఆలోచనలకు బాటలు వేస్తున్న పాలమూరు యూనివర్సిటీ కామర్స్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ రాజ్‌కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపిక చేసింది. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడంతో పాటు వివిధ అంశాల పై పరిశోధనలు, జాతీయ–అంతర్జాతీయ సెమినార్ల నిర్వహణలో ఆయన చేసిన కృషిని ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థుల్లో కామర్స్‌పై ఆసక్తి పెంచేందుకు పోటీలు, అకడమిక్ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పరిశోధన పట్ల కూడా ప్రోత్స హించారు. ఆయన పరిశోధనా పత్రాలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి. అధ్యాపక బాధ్యతలతో పాటు యూనివర్సిటీ పరిపాలనలోనూ కీలకంగా వ్యవహరించిన రాజ్‌కుమార్.. ప్రిన్సిపా ల్, అదనపు కంట్రోలర్, కంట్రోలర్, ఐక్యూఏసీ డైరెక్టర్ తదితర బాధ్యతలు నిర్వర్తించారు. బోధన, పరిశోధన, పరిపాలన లో అందించిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డు దక్కింది.
చాక్లెట్‌కు బదులు.. మొక్క!
వినూత్న బోధనతో విద్యార్థుల్లో కొత్త అలవాట్లు
రిటైర్మెంట్ తర్వాత.. తరగతి గదిలోనే!
అవిశ్రాంత బడిపంతులు.. మంగళగిరి నర్సోజి
మెరుగైన బోధన..
పరిశోధనకు పట్టం!


