వ్యవసాయ విద్యుత్ సరఫరాలో తీవ్రమైన కోతలు
● ఇప్పటికే రోడ్లెక్కి అన్నదాతల ఆందోళనలు
● ఖరీఫ్ సీజన్‌లో 3.28 లక్షల ఎకరాల్లో పంటల సాగు
● జిల్లాలో అత్యధికంగా పత్తి, వరి పంటలు
● ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు
గద్వాల: ఎల్‌నిన్ ప్రభావంతో ఈసారి జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. వాస్తవానికి వానాకాలం మొదలు జూన్ ఆఖరి వారం మొదలుకొని జూలై, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ, ఈ ఏడాది పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. అధిక వర్షాలు దేవుడెరుగు కనీసం కురవాల్సిన సాధారణ వర్షాలు కూడా కురవలేదు. గడిచిన రెండు నెలల్లో 63 మి.మీ., వర్షపాతం తక్కువ నమోదైందంటే జిల్లాలో ఎల్‌నినో ప్రభావం ఏస్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. వర్షాల పరిస్థితి ఇలా ఉంటే.. ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 3.28 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో అత్యధికంగా 1.72 లక్షల ఎకరాల్లో పత్తి, 78 వేల ఎకరాల్లో వరి సాగుచేశారు. అలాగే మొత్తం సాగైన పంటలలో వర్షాధారంగా 1.45 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు, జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల కింద 1.83 లక్షల ఎకరాలు సాగుచేశారు. అయితే ఈసారి తక్కువ వర్షాలు నమోదుతో విద్యుత్ వినియోగం పెరగడం, సరఫరా తగ్గడంతో కోతలు మొదలయ్యాయి. దీంతో విద్యుత్ కోతలపై రైతులు జిల్లావ్యాప్తంగా రోడ్డెక్కి ధర్నా చేసున్నారు. మరోవైపు సాగైన పంటలు గట్టెక్కాలంటే ఇంకా మూడు నెలల కాలం ఉంది. మరి అంతవరకు పంటలకు సాగునీరు అందుతుందా.. లేదా అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.


