ఆర్డీఎస్‌.. ఆపసోపాలు! | - | Sakshi
Sakshi News home page

ఆర్డీఎస్‌.. ఆపసోపాలు!

Aug 19 2026 12:48 AM | Updated on Aug 19 2026 12:48 AM

రాజోళి: ఆర్డీఎస్‌ ఆయకట్టు పర్యవేక్షణ లోపిస్తోంది. కాల్వలకు నీటి విడుదల నిలిచినా.. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఎదురైనా రైతులు సంబంధిత అధికారులను సంప్రదించేందుకు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ఇందుకు ఆర్డీఎస్‌ కార్యాలయం అందుబాటులో లేకపోవడమే ప్రధాన కారణం. ఆర్డీఎస్‌ ఆయకట్టు మొత్తం ఒకచోట ఉండగా.. కార్యాలయం మాత్రం జిల్లా కేంద్రంలో కొనసాగుతుండటంతో రైతులు తమ సమస్యలను తెలియజేసేందుకు అధికారులు అందుబాటులో లేకుండా పోతున్నారు. దీంతో ఆయకట్టు రైతులు మరింత ఆగమవుతున్నారు.

59ఏళ్ల క్యాంపు సేవలను వదిలి..

ఆర్డీఎస్‌ ఆయకట్టు, కెనాల్‌ను పరిగణనలోకి తీసుకుని 1955 ఫిబ్రవరి 15న అయిజ మండలం ఉప్పల్‌లో ఆర్డీఎస్‌ క్యాంపు కార్యాలయం ఏర్పాటుచేశారు. అప్పటి నుంచి ఉప్పల్‌ క్యాంపుగా పిలుస్తున్నారు. అయితే 2024లో ఆర్డీఎస్‌ డివిజన్‌–4లోకి మారిన తర్వాత ఇక్కడి నుంచి కార్యాలయాన్ని జిల్లా కేంద్రానికి తరలించారు. దీంతో దాదాపు 59ఏళ్ల పాటు ఉప్పల్‌ క్యాంపులో విధులు నిర్వర్తించిన అధికారులు.. ఆయకట్టు రైతులకు అందుబాటులో లేకుండాపోయారు. ఇక్కడ కార్యాలయం ఉండగా.. ఆయకట్టు రైతులకు ఉన్నతస్థాయి అధికారి నుంచి లస్కర్‌ వరకు సుపరిచుతులుగా ఉండేవారు. అధికారులకు కూడా రైతులు బాగా తెలిసిన వారిగా ఉండే వారు. రైతును చూడగానే వారి పొలం ఏ డిస్ట్రిబ్యూటరీ కింద ఉందో ఠక్కున చెప్పే వారు. ఎప్పుడూ అధికారుల తనిఖీలు, రైతుల రాకపోకలతో హడావుడిగా ఉండే ఉప్పల్‌ క్యాంపు ప్రస్తుతం వెలవెలబోతోంది. దాదాపు 32 ఎకరాల్లో నిర్మించిన ఈ క్యాంపులో అధికారులు ఉండేందుకు క్వార్టర్లు కూడా ఉన్నాయి.

కొరవడిన పర్యవేక్షణ..

ఆయకట్టులో నీటి దోపిడీ, రైతుల తగాదాలు, కెనాల్‌ కోతలు, మట్టి తవ్వకాలు, కెనాల్‌ రోడ్డుపై అక్రమ రాకపోకలు, రోడ్ల ధ్వంసం వంటి వాటి విషయాల్లో అధికారులు తనిఖీలు, పర్యవేక్షణ చేసేందుకు అందుబాటులో ఉండేవారు. కానీ ప్రస్తుతం ఆయకట్టు అవసరాలు పెరిగిన నేపథ్యంలో అందుబాటులో ఉండాల్సిన అధికారులు జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తుండటంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆయకట్టు మొత్తం ఒకచోట ఉండగా.. కార్యాలయాన్ని ఇతర ప్రాంతానికి ఎలా మారుస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి.. ఉప్పల్‌ క్యాంపులోనే ఆర్డీఎస్‌ కార్యాలయం కొనసాగించాలని కోరుతున్నారు.

ఆయకట్టు ఒకచోట.. కార్యాలయం మరోచోట

రైతులకు అందుబాటులో

ఉండని అధికారులు

సాగునీటి సమస్యల పరిష్కారంలో జాప్యం

32 ఎకరాల్లో నిర్మించిన ఉప్పల్‌ క్యాంపు వదిలి జిల్లా కేంద్రంలో కార్యకలాపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement