గద్వాల: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముసాయి దా ఓటరు జాబితాను ప్రకటించామని.. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వారీగా తమ పేర్లను సరిచూసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముసాయిదా జాబితాలో పేర్లు, పుట్టిన తేదీ లేదా చిరునామాలో తప్పులుంటే సవరించడానికి తగిన వివరాలు అందించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభించేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవెల్ ఏజెంట్లు సహకరించాలని కోరారు. సందేహాల నివృత్తికి స్థానిక తహసీల్దార్ లేదా ఎన్నికల అధికారులను సంప్రదించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీఓ శ్రీనివాసరావు ఉన్నారు.
వందశాతం హాజరు తప్పనిసరి..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు వందశాతం హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని.. సెలవు కావాల్సిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. ఐడీఓసీ వీసీ హాల్‌లో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎవరైనా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సెప్టెంబర్ 5వ తేదీలోగా విద్యార్థులందరికీ యూనిఫామ్స్ పంపిణీ చేయాలని సూచించారు. 10వ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. కాగా, అలంపూర్ చౌరస్తాలోని ప్రైవేటు పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు మెమోలు, టీసీలు ఇవ్వకుండా వేధిస్తుండటంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. సదరు పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డీఈఓ విజయలక్ష్మిని ఆదేశించారు.
● బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆహర్నిశలు పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కొనియాడారు. కలెక్టరేట్‌లో సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి అక్బర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
యూరియా అధిక వాడకంతో నేల సారవంతం తగ్గుతోందని.. యూరియా స్థానంలో నానో యూరియా వాడకాన్ని పెంచేలా అవగాహన కల్పించాల్సిన అవసరముందని కలెక్టర్ అన్నారు. మల్దకల్‌లోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువుల ధరలు, స్టాక్, రిజిస్టర్లు, పురుగు మందుల నిల్వలను పరిశీలించి.. నిబంధనల ప్రకారం వ్యాపారం నిర్వహించాలని డీలర్లకు సూచించారు. పెదొడ్డి గ్రామంలో ఆయిల్‌పామ్ మొక్కలను నాటారు. ఆయ న వెంట డీఏఓ వీరన్న ఉన్నారు.


