గద్వాల: మీసేవ కేంద్రాల్లో కాగిత రహిత సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిందని ఈ–డిస్ట్రిక్ మేనేజర్ శివ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు మీసేవ కేంద్రాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కాగిత రహిత పాలనలో భాగంగా మీ సేవ కేంద్రాల్లో సేవా రుసుము చెల్లించిన అనంతరం ముద్రిత రశీదులు ఇవ్వబడవన్నారు. చెల్లింపు వివరాలను నేరుగా వినియోగదారుల మొబైల్ ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ రూపంలో పంపబడతాయని తెలిపారు. అలాగే ప్రజలు దరఖాస్తు పత్రాలు పట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదన్నారు. జీపీఓ మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తులను స్వీకరించి.. సంబంధిత అధికారులు ఆన్‌లైన్‌లోనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం సౌకర్యం కల్పించిందని ఆయన వివరించారు.


