లంపీస్కిన్‌పై నజర్‌ | - | Sakshi
Sakshi News home page

లంపీస్కిన్‌పై నజర్‌

Jul 12 2026 1:29 AM | Updated on Jul 12 2026 1:29 AM

తెల్లజాతి పశువుల్లోనే అధికంగా వ్యాధి లక్షణాలు

ముందస్తుగా గోట్‌ పాక్స్‌ టీకాలు వేస్తున్న పశువైద్యులు

వంద మంది సిబ్బందితో ప్రత్యేక బృందాల ఏర్పాటు

మండలం యూనిట్‌గా తీసుకొని స్పెషల్‌ డ్రైవ్‌

జిల్లాలో మొత్తం 67,891 తెల్లజాతి పశువులు

గద్వాల వ్యవసాయం: లంపీస్కిన్‌ (ముద్దచర్మ వ్యాధి)పై పశుసంవర్ధక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వ్యాధి ప్రబలకుండా ఏటా ముందస్తుగా టీకాలు వేస్తున్నప్పటికీ ప్రధానంగా దూడలు, కోడెదూడల్లో అక్కడక్కడ లంపీస్కిన్‌ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ వ్యాది ప్రబలకుండా గత కొద్దిరోజుల నుంచి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తూ నివారణగా గోట్‌పాక్స్‌ టీకాలు వేస్తోంది. జిల్లాలో మొత్తం తెల్లజాతి పశువులు 67,891 ఉండగా.. వీటిలో ఇప్పటి వరకు 30,778 పశువులకు గోట్‌పాక్స్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

2022లో మొదటిసారి..

లంపీస్కిన్‌ వ్యాధి క్యాట్రీ ప్యాక్స్‌ అనే వైరస్‌ నుంచి వస్తుంది. ఆవులు, ఎద్దులు, లేగదూడల్లో ఈ వ్యాధి సోకుతుంది. బాహ్యపరాన్న జీవులు, వ్యాధి ఉన్న పశువు తాగిన నీరు, తిన్న గడ్డి వల్ల ఇతర పశువులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. 104 నుంచి 106 డిగ్రీల జ్వరం, మేత తినడం మందగించడం, చర్మంపై బొబ్బలు రావడం వ్యాధి ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు. ముందుగా దేశంలో గుజరాత్‌, మహారాష్ట్రలో ఈ వ్యాధిని గుర్తించారు. సంతల్లో, మార్కెట్‌లలో పశువుల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఒక రాష్ట్రం రైతులు మరో రాష్ట్రానికి వెళ్లి కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే మన రాష్ట్రంలోనూ 2022లో మొదటిసారిగా పలు ప్రాంతాల్లో పశువులకు ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి.

జూన్‌ 24 నుంచి..

తెల్లజాతి పశువుల్లో లంపీస్కిన్‌ వ్యాధి లక్షణాలు అక్కడక్కడ అగుపిస్తున్నాయి. జిల్లాలో కూడా కొన్నిచోట్ల వ్యాధి లక్షణాలు ఇక్కడి అధికారులు గుర్తించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధకశాఖను అప్రమత్తం చేసింది. వ్యాధి ప్రబలకుండా పశువైద్యాధికారులు ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకొని గ్రామాల వారీగా ప్రత్యేక బృందాలను నియమించారు. జూన్‌ 24 నుంచి తెల్లజాతి పశువులు లంపీస్కిన్‌ బారిన పడకుండా ముందస్తుగా గోట్‌పాక్స్‌ టీకాలు వేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ముందుగానే పాడి రైతులకు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు 45 శాతం తెల్లజాతి పశువులకు టీకాలు వేశారు. ఈ నెల 20 వరకు ఉచిత ముందస్తు టీకాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

వందమంది సిబ్బందితో..

2022 సంవత్సరం ఆగస్టులో జిల్లాలో లంపీస్కిన్‌ వ్యాధి లక్షణాలు పలు ప్రాంతాల్లో పశువుల్లో కనిపించాయి. దీంతో రైతులు ఆందోళన చెంది పశువైద్యాధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పశుసంవర్ధక శాఖ ఆయా పశువులను పరిశీలించి, ముందస్తు టీకాలు వేశారు. అయితే ఆ తర్వాత 2023 జూలై నెలలోనూ పలు ప్రాంతాల్లో పశువుల్లో లంపీస్కిన్‌ వ్యాధి లక్షణాలు అగుపించాయి. దీంతో పశుసంవర్ధకశాఖ వందమంది సిబ్బందితో మండలానికి మూడు బృందాలుగా ఏర్పాటు చేసి.. గోట్‌ పాక్స్‌ వ్యాక్సిన్‌ను పశువులకు వేశారు. కాగా 2024 జులైలో, 2025 మే నెలలో వ్యాధి రాకుండా ముందస్తుగా వ్యాక్సిన్‌ వేశారు. అయితే 2025 ఆగస్టు చివరి వారంలో జిల్లాలో మళ్లీ వ్యాధి ప్రబలింది. వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, పశువుల్లో వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉండటంతో ఈ వ్యాధి మళ్లీ ఆరంభం అయినట్లు అప్పట్లో పశుసంవర్ధకశాఖ అధికా రులు గుర్తించారు. 2025 ఆగస్టులో ఎక్కువగా లేగ దూడెల్లో వ్యాధి లక్షణాలు బయటపడగా.. సుమారు 20 లేగదూడలు వ్యాధి బారినపడి మృతిచెందాయి. దీంతో అప్పుడు ముందస్తు నివారణ టీకాలు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement