గద్వాల: జిల్లాలో ఆయిల్‌పాం తోటల సాగుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో 2 వేల ఎకరాల్లో ఆయల్‌పాం తోటల సాగును లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. ఎర్రవల్లి మండలం బీచుపల్లి వద్ద తెలంగాణ రాష్ట్ర నూనె ఉత్పత్తి సహకార సంఘం ద్వారా రైతులకు అవసరమైన మొక్కలను సిద్ధంగా ఉంచామన్నారు. ఎకరాకు 57 మొక్కలను నాటుకోవచ్చని, ఒక మొక్క ధర రూ.193 కాగా ఇందులో రైతులు కేవలం రూ.20 చొప్పున చెల్లిస్తే సరిపోతుందన్నారు. తోటల్లో ఐదు హెక్టార్ల వరకు ఎస్సీ, ఎస్టీ రైతులకు బిందుసేద్య పరికరాలు ఏర్పాటు చేసుకోవడానికి 90 శాతం, బీసీ రైతులకు 80 శాతం, ఇతర రైతులకు 70 శాతం సబ్సిడీ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన 1,777 మంది రైతులు 7,164.72 ఎకరాల్లో ఆయిల్‌పాం తోటలు సాగుచేశారన్నారు. కాగా ఇందులో 2014.53 ఎకరాల్లో 349 మంది రైతులకు 4,619.64 పంట టన్నుల దిగుబడి రాగా రూ.10,02,67,169 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఆయిల్‌పాం తోటల సాగుకు దరఖాస్తు చేసుకునే రైతుల సాగు భూమి, విద్యుత్ సదుపాయం, నీటి లభ్యతను ముందుగా క్షేత్రస్థాయిలో ఉద్యానవనశాఖ అధికారులు పరిశీలిస్తారన్నారు. బిందు సేద్య సౌకర్యం ఏర్పాటు చేసుకోవడానికి కూడా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. పూర్తి వివరాలకు రాజ్‌కుమార్ జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి సెల్ నం.89777 14301, గద్వాల, ధరూరు, మల్దకల్ మండలాల రైతులు ఉద్యాన అధికారి రాజశేఖర్ సెల్ నం.89777 14295, అలంపూర్, మానవపాడు, ఉండవెల్లి, వడ్డేపల్లి, ఇటిక్యాల, ఎర్రవల్లి రైతులు ఉద్యాన అధికారి ఇమ్రాన్ సెల్ నం.89777 14396, అయిజ, గట్టు, కేటీదొడ్డి, రాజోళి మండలాల రైతులు ఉద్యాన అధికారి మహేష్ సెల్ నం.89777 14297లను సంప్రదించాలని కోరారు.


