గద్వాల న్యూటౌన్: చదువుతోనే సమాజంలో మార్పు తీసుకురావడం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి సంగాల మహేశ్వర్‌రెడ్డి పాఠశాల అభివృద్ధికి రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు. శనివారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చేత ప్రిన్సిపల్‌కు ఆయన రూ.5 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు ఘనమైన చరిత్ర ఉందన్నారు. ఇక్కడ చదువుకున్న వారిలో చాలామంది వివిధ రంగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు. పూర్వ విద్యార్థి, సీఏ చార్టెడ్ అకౌంటెంట్ మహేశ్వర్‌రెడ్డి పాఠశాల అభివృద్ధికి తనవంతుగా రూ.5 లక్షలు అందించడం అభినందనీయమన్నారు. ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలిపారు. ఇంగ్లిష్ మీడియంలో ప్రావీణ్యం, కంప్యూటర్ విద్యలో నైపుణ్యం కల్పిస్తున్నారని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని రాణించాలన్నారు. అనంతరం మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తాను ఇక్కడ 7వ తరగతి వరకు చదువుకున్నానని, 8 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో చదివానని చెప్పారు. చదువుకున్న పాఠశాలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రూ.5 లక్షలు అందించానని పేర్కొన్నారు. పాఠశాలలో టాయిలెట్స్ సమస్య ఉన్నట్లు తెలుసుకొని.. తోటి మిత్రులతో కలిసి వాటి నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జయలక్ష్మి, కౌన్సిలర్లు ప్రియాంక, రామలింగేశ్వర్ కాంమ్లే, చంద్రశేఖర్, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు రాజశేఖర్, నాయకులు కృష్ణ, నరహరి, శ్రీనివాసులు, గోవిందు, ధర్మనాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


