మిగిలింది 5 రోజులే..
సాక్షి, నాగర్‌కర్నూల్: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఇంకా ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తికావడంతో అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించనుండగా ఎన్నికల ప్రచారానికి మాత్రం ఇంకా ఐదు రోజులే ఉంది. సమయం తక్కువగా ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఉన్న తక్కువ టైంలో ఎక్కువ మంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
రెబల్స్ పోరుతో ఆందోళన..
మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ ఎక్కువ సంఖ్యలో పోటీలో ఉండటంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల్లో ఆందోళన నెలకొంది. ప్రధానంగా మహబూబ్‌నగర్, గద్వాల మున్సిపాలిటీల్లో రెబల్స్ పోరు అఽధికంగా ఉండటంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో అత్యధికంగా 347 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, గద్వాల మున్సిపాలిటీలో 160 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో అత్యధికులు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు చెందిన వారే రెబల్స్‌గా ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో సొంత పార్టీలోనే ఇద్దరు అభ్యర్థుల పోటీతో ఎన్నికల్లో పార్టీకి నష్టం జరుగకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు, పార్టీల ముఖ్య నేతలు రంగంలోకి దిగుతున్నారు.
వార్డుల వారీగా ఇన్‌చార్జ్‌లకు బాధ్యతలు..
మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక వార్డులను సొంతం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తున్నాయి. మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా పార్టీ నేతలకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. వార్డులో ఉన్న ఓటర్లలో కులాల వారీగా ఉన్న ఓట్లపై దృష్టి పెట్టి గంపగుత్తగా ఓట్లను పొందేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. ప్రధానంగా మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉండటంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ప్రధాన పార్టీలకు అగ్ని పరీక్షే..
మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ స్థానాలను కై వసం చేసుకునేందుకు మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల ఏకగ్రీవం కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు కొనసాగించారు. అయితే సొంత పార్టీలోనే అభ్యర్థులు రెబల్స్‌గా పోటీ చేయడంతో ఏం జరుగుతోందన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో నెలకొంది. ఇప్పటికే పార్టీలో ఏళ్లుగా కొనసాగిన సీనియర్ నాయకులు టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేశారు. మున్సిపాలిటీల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు బీఆర్‌ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. బీజేపీ సైతం మున్సిపల్ ఎన్నికల్లో పాగా వేసేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. అర్బన్ ఓటింగ్ తమకు అనుకూలంగా ఉంటుందని ఈ ఎన్నికల్లో సత్తాచాటాలని ఆ పార్టీ భావిస్తోంది.
మహిళా ఓట్లకు గాలం..
మున్సిపల్ ఎన్నికల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మూడు ప్రధాన పార్టీలు దృష్టిపెట్టాయి. ఎక్కువ సంఖ్యలో ఉన్న మహిళల ఓట్లను పొందేందుకు మహిళా సంఘాలతో సమావేశాలను నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా మహిళల సమస్యలను పరిష్కరిస్తామని హామీలు గుప్పిస్తున్నారు. వార్డుల వారీగా మహి ళా సంఘాల బాధ్యులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని మరింత హోరెత్తించనున్నాయి.
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి
సమీపిస్తున్న గడువు
పట్టణ వీధుల్లో హోరెత్తిస్తున్న
ప్రధాన పార్టీలు
వార్డుల వారీగా పార్టీ ఇన్‌చార్జ్‌లకు బాధ్యతలు
అభ్యర్థుల ఖర్చులకు ప్రత్యేక నేతల నియామకం
గద్వాల, మహబూబ్‌నగర్‌లో రెబల్స్ పోరుతో ఆందోళన


